ttd

తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి 36 గంటల సమయం

తిరుమల- తిరుమలలో భక్తుల రధ్దీ కొనసాగుతోంది. వేసవి సెలవుల నేపధ్యంలో దేశం నలుమూలల నుంచి వస్తున్న భక్తులతో తిరుమల పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. కలియుగ ప్రత్యక్ష్య దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు అదిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారు. దీంతో తిరుమలలోని అన్నీ కంపార్ట్‌ మెంట్లు, షెడ్లు నిండిపోయాయి. శ్రీవారి దర్శనం కోసం సుమారు మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు వేచిచూస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయి, శిలాతోరణం వరకు రెండు కిలోమీటర్ల మేర క్యూలైన్‌ లో భక్తులు ఎదురుచూస్తున్నారు.

సర్వదర్శనం కోసం టోకెన్‌ లేని భక్తులకు శ్రీనివాసుడి దర్శనానికి సుమారు 36 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, అన్నప్రసాదాలు అందించేలా అన్ని ఏర్పాట్లు చేసింది టీటీడీ. భక్తుల రద్దీ దృష్ట్య టీటీడీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. తిరుమలలో భద్రతను సైతం కట్టుదిట్టం చేశారు. నిన్న శుక్రవారం శ్రీవారిని 77,436 మంది భక్తులు దర్శించుకోగా 38,980 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా ఆలయ హుండీకి 3.77 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని టీటీడీ తెలిపింది. మరో 15రోజుల పాటు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.


Comment As:

Comment (0)