కుప్పంలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు
మళ్లీ జన్మంటూ కుప్పం బిడ్డగానే పుడతా -చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా స్థానిక బస్టాండ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. మళ్లీ జన్మంటూ ఉంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతానని చంద్రబాబు అన్నారు. నేను ఇక్కడకు వచ్చినా, రాకున్నా నన్ను ఆదరించారని చెప్పిన చంద్రబాబు.. ఇప్పటి వరకు నన్ను 8 సార్లు గెలిపించారని కొంత భఆవోద్వేగానికి లోనయ్యారు. కుప్పం ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాని అన్న చంద్రబాబు.. కుప్పం వ్యవహారాలు చూస్తున్న ఎమ్మెల్సీ శ్రీకాంత్, మంత్రి రాంప్రసాద్ రెడ్డి, మండల పార్టీ నేతలకు అభినందనలు తెలిపారు.
ప్రజాస్వామ్యంలో అహంకారంతో విర్రవీగితే వైసీపీకి పట్టిన గతే పడుతుందని ప్రజలు నిరూపించారని చంద్రబాబు అన్నారు. నా రాజకీయాలకు కుప్పం నియోజకవర్గం ప్రయోగశాల అని, వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే కుప్పంను ఎంచుకున్నానని చెప్పారు. చిత్తూరు జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గుర్తు చేసిన చంద్రబాబు.. వచ్చే ఐదేళ్లలో కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రయత్నిస్తానని హామి ఇచ్చారు. ఏ తప్పూ చేయకున్నా 30 మంది కార్యకర్తలను జైల్లో పెట్టారని ఆవేధన వ్యక్తం చేశారు చంద్రబాబు.