AP High Court

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్- రెండు రోజుల్లో తీర్పు

ఆంద్రప్రదేశ్ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశ్ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ పై ఏపీ హైకోర్టు (AP High court)లో వాదనలు ముగిశాయి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సుమారు ఐదు గంటల పాటు వాదనలు వాడివేడిగా సాగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత ఉన్నత హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. రెండు రోజుల్లో తుది తీర్పు వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

 ఆంద్రప్రదేశ్ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఇరు పక్షాల తరఫున మొత్తం ఐదు మంది న్యాయవాదులు వాదనలు వినిపించారు. సుదీర్ఘంగా కొనసాగిన వాదనల్లో పలు కీలక అంశాలను న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించారు. ఈ కేసులో అవినీతి జరిగిందని, డబ్బులు పోయాయని సీఐడీ ఆరోపిస్తున్నప్పటికీ, అసలు ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందో ఆధారాలు చూపకపోవడం, స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ ఇప్పటికీ తెరిచే ఉండటం, వాటిలో యువతకు శిక్షణ సైతం కొనసాగుతున్న పరిస్థితులను కోర్టుకు వివరించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17, అసలు ఈ కేసులో అవకతవకలు జరిగాయా? ఎన్నికల సమయంలో కావాలనే కుట్రపూరితంగా ఈ కేసులో చంద్రబాబును ఇరికించారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ కేసులో ఫిర్యాదే ఓ కట్టుకధ అని, ఎఫ్‌ఐఆర్‌ చట్టవిరుద్ధంగా ఉందంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు హరీశ్‌ సాల్వే (harish salve), సిద్ధార్థ్‌ లూథ్రా (sidharth luthra) హైకోర్టు ధర్మాసనం ముందు తమ వాదనలు గట్టిగా వినిపించారు. ఇక సీఐడీ తరఫు న్యాయవాదులు షెల్‌ కంపెనీల ద్వారా నగదు వెళ్లిందని, ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్లిందో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాల్సి ఉందని ధర్మాసనం ముందు తమ వాదనలు వినిపించారు. ఈ దశలో కోర్టులు కలుగజేసుకోరాదని వాదించారు. ఈ కేసులో చంద్రబాబుకు 17ఎ వర్తించదని ఆర్గ్యూ చేశారు. ఆంద్రప్రదేశ్ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కు సంబంధించి న్యాయవాదులు కౌంటర్‌ దాఖలు చేయాలని, వాళ్లను సైతం చేర్చుకొనేందుకు మరో వారం రోజులు గడువు ఇవ్వాలని కోర్టును కోరారు సీఐడీ తరపు న్యాయవాదులు.

అన్ని వాదనలు ఈరోజే పూర్తిచేయాలని ఒక దశలో ధర్మాసనం పేర్కొనడంతో కౌంటర్‌ వాదనలు ఈరోజే వినిపించడంతో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. దీంతో క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. చంద్రబాబు క్వాశ్ పిటీషన్ పై రెండు రోజుల్లో తుది తీర్పు వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


Comment As:

Comment (0)