Chandrababu Amaravathi

ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ధీమా

అమరావతిపై భావోద్వేగానికి గురైన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. గడిచిన ఐదేళ్లుగా అమరావతికి జరిగిన నష్టాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వార చూపించారు. ప్రస్తుతం అమరావతి ఎలాంటి గడ్డు పరిస్థితిలో ఉందో వివరించారు చంద్రబాబు. తమ కష్టాన్ని నాశనం చేశారని, ఇది తెలుగు జాతికి జరిగిన ద్రోహంగా చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో ధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించిన చంద్రబాబు, వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఇవాళ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. 

పదేళ్లైనా రాష్ట్రానికి రాజధాని లేకపోవడం విచారకరమని సీఎం చంద్రబాబు అన్నారు. 2014-19 మధ్య తమ హయాంలో 9వేల కోట్లతో చేపట్టిన నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయని చెప్పారు. తాము పడిన కష్టాన్నంతా వైసీపీ ప్రభుత్వం వృథా చేసిందన్న చంద్రబాబు ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. అమరావతి చరిత్ర సృష్టించే నగరమని ఈ సందర్బంగా చంద్రబాబు చెప్పారు. శాతవాహనుల కాలంలోనే అమరావతి కేంద్రంగా పాలన జరిగిందని.. రాష్ట్రంలో ఎటు చూసినా సమ దూరం ఉన్న ఏకైక ప్రాంతం అమరావతి అన్నారు. అందుకే దీన్ని రాజధానిగా నిర్ణయించామన్న చంద్రబాబు.. బుద్ధి, జ్ఞానం ఉన్న ఏ వ్యక్తి కూడా రాజధానిగా అమరావతిని వ్యతిరేకించరన్నారు. 

ప్రపంచలోనే అతిపెద్ద ల్యాండ్‌ పూలింగ్‌ అమరావతిదే అన్న చంద్రబాబు.. వరల్డ్‌ బ్యాంక్‌ దీనిని ఓ కేస్‌ స్టడీగా చూపిందని గుర్తు చేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి చాలా బ్యాంకులు ముందుకు వచ్చాయని, సింగపూర్‌ దేశం మాస్టర్‌ ప్లాన్‌ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. అమరావతిలో మొత్తం 9 నగరాలను అమరావతిలో ఏర్పాటు చేశామన్న చంద్రబాబు.. ఉమ్మడి రాష్ట్రానికి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైబరాబాద్‌ను నిర్మించానని, తొమ్మిదేళ్లలో సైబరాబాద్‌కు ఒక ఎకో సిస్టమ్‌ను తయారు చేశానని చెప్పుకొచ్చారు. హైటెక్‌ సిటీని డెవలప్‌ చేయటానికి 14 రోజుల పాటు అమెరికాలో ఉన్నానని ఈ సందర్బంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 

హైదరాబాద్‌ మదిరిగానే ఏపీ రాజధాని అమరావతిని కూడా ప్రపంచ స్థాయి సిటీగా మారుస్తానని బలంగా చెప్పారు చంద్రబాబు. జగన్ పాలనలో అమరావతి బ్రాండ్‌ ఇమేజ్‌ బాగా దెబ్బతిన్నదని, భవిష్యత్‌పై నమ్మకం ఏంటని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని, అమరావతి బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచడంపై దృష్టి పెడతామని చెప్పారు. రాధాని అమరావతి నిర్మాణంతో ఆదాయం పెరుగుతుందని, కృష్ణా, గోదావరి నదుల వల్ల అమరావతికి నీటి కష్టాలుండవని చంద్రబాబు అన్నారు.


Comment As:

Comment (0)