తెలంగాణలో 9 నుంచి 13 ఎంపీ సీట్లు గెలుస్తాం- సీఎం రేవంత్
హైదరాబాద్ రిపోర్ట్- తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది నుంచి 13 ఎంపీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). ఆరు నుంచి ఏడు ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రావని ఆయన అభిప్రాయపడ్డారు. మెదక్ లోక్ సభ స్థానంలో బీజేపీ మూడోస్థానంలోకి పడిపోయిందని సీఎం అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కనీసం 20వేల మెజారిటీ వస్తుందని చెప్పారు. బీజేపీకి తెలంగాణలో వేవ్ లేదని, బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీ కోసం పనిచేశారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇక కేంద్రంలో బీజేపీకి 220 ఎంపీ సీట్ల కంటే మించి రావని సీఎం రేవంత్ చెప్పారు. తనను జాతీయ స్థాయిలో స్టార్ క్యాంపెయినర్ గా పార్టీ నియమించిందని, ఇతర రాష్ట్రాల్లో ప్రచారంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. తనకు పార్టీ ఏ పని అప్పగిస్తే అది చేస్తానన్న రేవంత్.. రేపటి నుంచి పూర్తిస్థాయిలో పరిపాలనపై దృష్టిపెడతానని చెప్పుకొచ్చారు. రైతు రుణమాఫీ, ఇతర సమస్యలు, విద్యా సంవత్సరం మొదలు కానుండటంతో సన్నబియ్యం సరఫరా, పుస్తకాలు, యూనిఫాం పంపిణీపై సమీక్షలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు అధికారంలోకి వచ్చినా తెలంగాణ ప్రయోజనాల కోసం సఖ్యతగానే ఉంటామని చెప్పారు.