ఓవైసీ కాంగ్రెస్ ను విమర్శించినా సంతోషంగా ఉండేది- సీఎం రేవంత్ రెడ్డి
అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) కొన్నిసార్లు కాంగ్రెస్‌ను విమర్శించినా సంతోషంగా అనిపించేదని చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). ఎందుకంటే విమర్శించేది నా సోదరుడే కాబట్టి అని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లోని ఆరాంఘర్ లో ప్రముఖ రచయిత మౌలానా రెహమాన్ రాసిన ప్రొఫెట్ ఫర్ ద వరల్డ్ పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ ఆలి తదితరులు పాల్గొన్నారు. అన్ని మతాలు చెప్పింది ఒక్కటేనని, అందరం కలిసిమెలసి శాంతి యుతంగా ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
ఇక అసదుద్దీన్ ఓవైసీ, తాను లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఆయన గిరిజనులు, మైనార్టీల గురించి మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉండేదని గుర్తు చేసుకున్నారు. ఐతే ప్రస్తుతం లోక్ సభలో ప్రజల గొంతు వినిపించే వారు తక్కువగా ఉన్నారని.. జైపాల్‌రెడ్డి లాంటి నాయకులు ఇప్పుడు లేరని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలోనే అసద్ భాయ్ తో కొట్లాట అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మంచి చేయడమే తమ లక్ష్యమని అన్నారు.