ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ప్రజల నుంచి సలహాలు, సూచనల స్వీకరణ
విస్తృత సంప్రదింపులు, అఖిలపక్ష భేటీ తర్వాతే నూతన చట్టం
సమస్యల అధ్యయనానికి పైలెట్ ప్రాజెక్టుగా ఓ మండలం ఎంపిక
ధరణితో తలెత్తుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. భూ సమస్యలు నానాటికీ ఎక్కువవుతుండడంతో సమ్రగ చట్టం రూపొందించాల్సి ఉందన్నారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవార సాయంత్రం ధరణి సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఒకప్పుడు గ్రామ స్థాయిలోనే అందుబాటులో ఉండే రికార్డులు చట్టాల మార్పుతో క్రమంగా మండల కేంద్రానికి, తర్వాత జిల్లా కేంద్రానికి, రాష్ట్ర స్థాయికి వెళ్లిపోయాయన్నారు. గతంలో భూ సమస్యల పరిష్కారానికి అప్పీలు చేసుకునే అవకాశం ఉండేదని గుర్తు చేశారు. ధరణితో గ్రామ, మండల స్థాయిలో ఏ సమస్యకు పరిష్కారం లేకుండాపోయిందని, సమస్త అధికారులు జిల్లా కలెక్టర్‌కు అప్పజెప్పారన్నారు. అక్కడ కూడా సమస్య పరిష్కారం కావడం లేదని, కలెక్టర్లు తీసుకునే ఏ నిర్ణయాన్ని ప్రశ్నించే అవకాశం లేకుండా ధరణిని రూపొందించారన్నారు.
ఈ నేపథ్యంలో భూ సమస్యల పరిష్కారానికి విస్తృతస్థాయి సంప్రదింపులు చేపట్టాలని, ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని ముఖ్యమంత్రి అన్నారు. అలాగే అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలతో సమగ్ర చట్టం తీసుకురావల్సి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భూదాన్, పోరంబోకు, బంచరాయి, ఇనాం, కాందిశీకుల భూముల సమస్యలున్న ఓ మండలాన్ని ఎంపిక చేసుకొని, అక్కడ ఎదురవుతున్న సమస్యలపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక రూపొందిస్తే ఆ సమస్యలపైనా పూర్తి స్పష్టత ఏర్పడుతుందన్నారు. అవసరమైతే వీటన్నింటిపై శాసనసభలో చర్చ చేసి తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి జానా రెడ్డి, ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి, సునీల్ కుమార్, రేమండ్ పీటర్, మధుసూదన్, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి, ముఖ్యమంత్రి కార్యదర్శులు వేముల శ్రీనివాసులు, సంగీత సత్యానారాయణ, అజిత్ రెడ్డి పాల్గొన్నారు.