ఏపీ చరిత్రలోనే రెండవసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్
ఏపీ రాష్ట్ర బడ్జెట్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు సర్కార్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. 2024 ఎన్నికల నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో ఎన్నికల తరువాత టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఈ నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో యధావిధిగా 2024-25 ఆర్ధిక యేడాదికి పూర్తిస్థాయి బడ్జెట్ పెడతారని అంతా భావించారు.
గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు జులై 31 ముగుస్తోంది. అందుకే మరి కొన్నాళ్లపాటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నే కొనసాగించాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీంతో మంగళవారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు సంబందించిన ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువచ్చింది చంద్రబాబు సర్కార్.
ఈ ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్‌కు వర్చువల్ విధానం ద్వార క్యాబినెట్ మంత్రుల నుంచి ఆమోదం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ తరువాత ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్ కు పంపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఒకే యేడాదిలో రెండు సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. దాదాపు1.30 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.