Chandrababu Naidu

ఇది నా బాధ.. ఆవేదన.. ఆక్రందన - న్యాయమూర్తితో చంద్రబాబు

తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారన్న చంద్రబాబు

అమరావతి రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు (Chandrababu) మరో రెండు రోజుల పాటు రిమాండ్ ను పొడగించారు.ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయిన చంద్రబాబు రిమాండ్‌ 22వ తేదీతో ముగియడంతో పోలీసులు ఆయనను రాజమహేంద్రవరం జైలు నుంచి వర్చువల్‌ గా కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కస్టడీపై న్యాయమూర్తి చంద్రబాబు అభిప్రాయాన్ని అడిగారు. జైలులో పెట్టి తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని చంద్రబాబు ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి చెప్పారు. తన హక్కులను రక్షించాలని, న్యాయాన్ని కాపాడాలని ఆయన కోరారు.

తనది 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితమని చంద్రబాబు న్యాయమూర్తికి చెప్పారు. నోటీసు ఇవ్వకుండా తనను అరెస్ట్‌ చేశారని, చన తప్పు ఉంటే విచారణ చేసి అరెస్ట్‌ చేయాల్సిందని అన్నారు. తాను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుందన్న చంద్రబాబు, తనను అన్యాయంగా అరెస్ట్‌ చేశారని ఆవేధన వ్యక్తం చేశారు. ఇది నా బాధ.. నా ఆవేదన.. నా ఆక్రందన.. అని కామెంట్ చేశారు. ఈ వయసులో తనకు పెద్ద పనిష్మెంట్‌ ఇచ్చారన్న చంద్రబాబు.. తనపై ఉన్నవి కేవలం ఆరోపణలు మాత్రమే నని.. అవి నిర్ధారణ కాలేదని న్యాయమూర్తితో అన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, తాను చట్టాన్ని గౌరవిస్తానని, న్యాయం గెలవాలని చంద్రబాబు చెప్పారు.

ఆ తరువాత చంద్రబాబుతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ.. మీరు పోలీసు కస్టడీలో లేరు.. జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారని అన్నారు. మీరు దీన్ని శిక్షగా భావించ వద్దని.. మీపై వచ్చినవి ఆరోపణలు మాత్రమే.. నేరనిరూపణ కాలేదని చెప్పారు. చట్టం, నిబంధనల ప్రకారమే మీకు రిమాండ్‌ విధించామన్న న్యాయమూర్తి.. జైలులో సౌకర్యాల విషయంలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. సౌకర్యాలు అవసరమైతే దానికి అనుగుణంగా ఆదేశిస్తామని చంద్రబాబుతో చెపపారు. మీరు ఈ నెల 24 వరకు జ్యుడిషియల్‌ కస్టడీలోనే ఉంటారని, మిమ్మల్ని కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అడుగుతోందని తెలిపారు. మీ తరఫు న్యాయవాదులు కస్టడీ అవసరం లేదని వాదించారని చంద్రబాబుకు చెప్పిన న్యాయమూర్తి.. చట్టం ముందు అందరూ సమానమేనని కామెంట్ చేశారు.


Comment As:

Comment (0)