కేరళ బధితుల కోసం భారీగా విరాళాలు ఇస్తున్న సినీ ప్రముఖులు
కేరళలో ప్రకృతి విళయతాండవం చేసింది. వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ పలు గ్రామాల్లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పులువురు రాజకీయ, వ్యాపార, సినీ రంగ ప్రముఖులు కేరళ విపత్తు బాధితుల కోసం ఆపన్నహస్తం అందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ సంయుక్తంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం కోటి రూపాయల విరాళం ప్రకటించారు. వయనాడ్ మృతుల కుటుంబాలకు సోషల్ మీడియా వేదికగా సానుభూతి తెలిపారు.
వయనాడ్ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి విషయంలో నా గుండె తరుక్కుపోతోంది.. బాధితులు తమ బాధ నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.. అని చిరంజీవి పేర్కొన్నారు. మరోవైపు కేరళ ప్రకృతి విపత్తుపై స్టైలష్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆయన 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అటు తమిళ హీరో సూర్య, ఆయన భార్య జ్యోతిక, సోదరుడు కార్తి సంయుక్తంగా 50 లక్షలు, నయనతార, ఆమె భర్త విఘ్నేశ్ శివన్ దంపతులు 20 లక్షల విరాళాలు ప్రకటించారు. మలయాళ నటులు మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ కలిపి 35 లక్షలు, ఫహాద్ ఫాజిల్ 25 లక్షలు, కమల్ హాసన్ 25 లక్షలు, 20 లక్షలు, రష్మిక మందన్న 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు.
ఇక మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ స్వయంగా వయనాడ్ విధ్వంసక సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తాను వ్యవస్థాపకుడిగా ఉన్న విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా 3 కోట్ల రూపాయల విరాళం బాధితుల కోసం ఇస్తున్నట్టు ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ, సినీ ప్రముఖులు కేరళ విపత్తుకు సంబందించిన బాధితుల కోసం విరాళాలు ప్రకటిస్తున్నారు. అటు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.