డీఎస్సీ పరీక్ష వాయిదా సరికాదన్న భట్టి విక్రమార్క
త్వరలోనే 6వేల పోస్టులతో మరో డీఎస్సీ - డిప్యూటీ సీఎం భట్టి
డీఎస్సీ పరీక్షల వాయిదా సరికాదన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka). నిరుద్యోగుల సమస్యలపై స్పందించిన భట్టి.. నిరుద్యోగ యువతపైనే తమ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన మొదటి మూడు నెలల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని గుర్చు చేశారు భట్టి విక్రమార్క. ప్రభుత్వ శాఖల్లో మిగిలిన ఉద్యోగాల భర్తీకి తమ ప్రబుత్వం కట్టుబడి ఉందని చెప్పుకొచ్చారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నదే యువతకు ఉద్యోగాల కోసమని చెప్పిన భట్టి విక్రమార్క.. అధికారంలోకి రాగానే 16 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. ఇప్పటి వరకు 11వేల టీచరు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు.. 19,717 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చామని, 34 వేల మందిని బదిలీ చేశామని చెప్పుకొచ్చారు. ఈనెల 11 నుంచి డీఎస్సీ హాల్ టికెట్లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచామని.. కొన్ని నెలలుగా అభ్యర్థులు డీఎస్సీ పరీక్షలకు అభ్యర్ధులు సన్నద్ధమవుతున్నారని చెప్పారు భట్టి విక్రమార్క.
జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పలు ఉద్యోగ పరీక్షలు వాయిదా వేయాలని విజ్ఞప్తులు చేయడంతో పాటు ధర్నాలు చేస్తున్నారని గుర్తు చేసిన భట్టి.. పదేళ్లలో ఎన్నడూ గ్రూప్-1 నిర్వహించలేదని విమర్శించారు. గ్రూప్-2ను ఇప్పటికే మూడు సార్లు వాయిదా వేశారని చెప్పారు. పరీక్షలు అన్ని సార్లు వాయిదా వేయడం సరికాదని.. త్వరితగతిన ఉద్యోగాలు ఇవ్వడమే మా లక్ష్యమని తేల్చి చెప్పారు. ఇక హాస్టల్ వెల్ఫేర్ కి సంబంధించి 581 ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించామని తెలిపారు భట్టి విక్రమార్క. త్వరలోనే 6వేల పోస్టులతో మరో డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.