సమన్లు 10 రోజులు వాయిదా వేసినకి ఈడీ
దిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు ఊరట
ఢిల్లీ రిపోర్ట్- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (Kalvakuntla Kavitha) దిల్లీ మద్యం కేసులో (Delhi Liquor Scam) స్వల్ప ఊరట లభించింది. కవితకు సమన్ల జారీని 10 రోజులు వాయిదా వేస్తామని ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) శుక్రవారం సుప్రీం కోర్టుకు తెలియజేసింది. దిల్లీ మద్యం కేసులో మరోసారి విచారణకు హాజరుకావాలంటూ ఈడీ జారీచేసిన సమన్లు సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద మహిళలకు ఉన్న హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయని, వాటిని కొట్టేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీంతో ఈడీ తరఫున కోర్టుకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ASG) ఎస్‌వీ రాజు న్యాయస్థానానికి ఈ మేరకు హామీ ఇచ్చారు. ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. ఈడీ జారీ చేసిన సమన్ల ప్రకారం శుక్రవారం కవిత దిల్లీలోని ఈడీ కార్యాలయంలో హాజరుకావాల్సి ఉండగా, సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణకు రానున్న నేపథ్యంలో ఆమె హాజరుకాలేదు.
శుక్రవారం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధులియాలతో కూడిన ధర్మాసనం ముందు ఈ కేసు విచారణ మొదలైన వెంటనే ఈడీ తరఫున హాజరైన ఏఎస్‌జీ ఎస్‌వీ రాజు విచారణను స్వల్పకాలం వాయిదా వేసి తదుపరి తేదీ ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ క్రమంలో కల్వకుంట్ల కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌధరి జోక్యం చేసుకుంటూ.. తమ క్లయింట్‌ను విచారణ కోసం హాజరుకావాలని బలవంతపెట్టబోమని గతంలో ఈడీ అధికారులు హామీ ఇచ్చారని గుర్తు చేస్తూ, ఆ ఉత్తర్వులను కొనసాగించాలని కోర్టును కోరారు. ఐతే ఈ వాదనతో ఏఎస్‌జీ విభేదించారు. తాము కవితకు సమన్లు జారీ చేసినప్పుడు పది రోజుల సమయం ఇస్తామని చెప్పామని, ఆ మేరకు గడువు ఇచ్చామని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది ధర్మాసనం.