సాద్యాసాధ్యాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
ఏపీలో 70 వేల కోట్లతో చమురు శుద్ధి కర్మాగారం, పెట్రోకెమికల్ కారిడర్
ఆంధ్రప్రదేశ్ లో సుమారు 70 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో చమురు శుద్ధి కర్మాగారం, పెట్రోకెమికల్ కారిడర్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) చెప్పారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటిడ్ (బీపీసీఎల్) ఛైర్మన్, ఎండీ కృష్ణకుమార్ నేతృత్వంలోని ప్రతినిధులతో బుధవారం అమరావతిలో సీఎం చంద్రబాబు ప్రత్యేకందా బేటీ అయ్యారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి ఎక్స్-ట్విట్టర్ వేదికగా తెలిపారు.
భారత్ కు తూర్పు తీరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కు గణనీయమైన పెట్రోకెమికల్ సామర్థ్యం ఉందని ఈ సందర్బంగా చంద్రబాబు చెప్పారు. ఈ చమురు శుద్ధి కర్మాగారం, పెట్రోకెమికల్ కారిడర్ ప్రాజెక్టు కోసం దాదాపు 5వేల ఎకరాల భూమి అవసరమవుతుందని అన్నారు. 90 రోజుల్లో ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై వివరణాత్మక ప్రణాళికతో కూడిన సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ లో పేర్కొన్నారు.