Narendra Modi

ఆంధ్రప్రదేశ్ విభజన సరిగ్గా జరగలేదన్న ప్రధాని

తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

నేషనల్ రిపోర్ట్- సమైఖ్య ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ప్రారంభమైన పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో (Parliament Session) మోదీ ప్రసంగించారు. పార్లమెంటు 75ఏళ్ల ప్రస్థానంపై మోదీ పలు ఘట్టాలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ (Telangana) ఏర్పాటు ఈ పార్లమెంట్ భవనంలోనే జరిగిందని ప్రధాని చెప్పారు. ఐతే ఉత్తరాఖండ్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌లా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన జరగలేదని మోదీ అన్నారు. వాజ్‌పేయీ హయాంలో మూడు రాష్ట్రాల విభజన ప్రణాళికాబద్ధంగా జరిగిందన్న ప్రధాని.. ఆ మూడు రాష్ట్రాల విభజన సమయంలో అన్ని చోట్లా సంబరాలు జరిగాయని చెప్పారు.

కానీ, ఆంధ్రప్రదేశ్ విభజన సరిగా జరగలేదని, ఈ విభజన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇరు వర్గాలనూ సంతృప్తి పర్చలేకపోయిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగిందన్న మోదీ.. తెలంగాణ ఏర్పాటు సమయంలో రక్తపుటేర్లు పారాయని కామెంట్ చేశారు. కొత్త రాష్ట్రం వచ్చినా తెలంగాణ సంబరాలు చేసుకోలేకపోయిందని అన్నారు ప్రధాని మోదీ (PM Modi). పార్లమెంట్ పాత భవనానికి వీడ్కోలు పలుకుతూ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు ప్రధాని. ఈ నేపథ్యంలో పాత భవనంలో పలు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న ప్రధాని.. ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని కూడా ప్రస్తావించారు. నేటి సమావేశాలు పార్లమెంట్‌ పాత భవనంలో జరుగ్గా, మంగళవారం నుంచి కొత్త భవనంలోకి మారనున్నాయి.


Comment As:

Comment (0)