ఆంధ్రప్రదేశ్ లోను హైడ్రా ఏర్పాటు?
ఆంధ్రప్రదేశ్ లోను హైడ్రా తరహా వ్యవస్తను ఏర్పాటు చేసే దిశగా టీడీపీ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ చెరువుల ఆక్రమణలను అడ్డుకునేందుకు రేవంత్ సర్కార్ హైడ్రా ను ఏర్పాటు చేయగా మంచి ఫలితాలు ఇస్తోంది. దీంతో హైడ్రా వంటి వ్యవస్థను తమ దగ్గరా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఏపీ ప్రజల నుంచి వస్తోంది. దీంతో ఆంధ్రప్రదశ్ లోను హైడ్రా వంటి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసే యోచనలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగునంగానే ఏపీ మంత్రి నారాయణ వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమయ్యాయని మంత్రి నారాయణ విమర్శించారు. విశాఖపట్నంలోని కాపులుప్పాడ డంపింగ్ యార్డును ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి ఆయన పరిశీలించారు. అక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌ను సందర్శించారు. రుషికొండ భవనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారని, అందరితో చర్చించి ఆయన నిర్ణయం తీసుకుంటారని నారాయణ తెలిపారు. విశాఖపట్నంలో పార్కును ఆక్రమించి నిర్మాణాలు చేశారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. అక్రమ నిర్మాణాలు చేపడితే హైడ్రా తరహా చర్యలు మొదలుపెట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు.