సికింద్రాబాద్ లోని ఉజ్జయినీ మహంకాళి బోనాలు (Secunderabad Bonalu) అంగరంగ ైభవంగా జరుగుతున్నాయి. ఉజ్జయిని మహంకాళి ఆలయం దగ్గర బోనాల సందర్బంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఉదయం అమ్మవారికి ప్రత్యేకంగా మహా హారతి, కుంకుమ, పుష్ప అర్చనలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు సాధారణ ప్రజలతో పాటు ప్రముఖులు భారీగా విచ్చేస్తున్నారు. మహంకాళి అమ్మవారిన దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున క్యూలైన్లలో వేచి ఉన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం 8 గంటల సమయంలో ఆలయలానికి విచ్చేసిన ముఖ్యమంత్రికి అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు ఉన్నారు.