Radhakishan Rao

రాధాకిషన్‌రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడి

ఆయన ఆదేశాలమేరకే ఫోన్ ట్యాపింగ్ చేశాము

హైదరాబాద్ స్పెషల్ రిపోర్ట్- తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ (phone tapping) కేసు అంతకంతకు సంచలనం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి పలు కీలక అంశాలు బయటకువస్తున్నాయి. అసలు ఫోన్ ట్యాపింగ్‌ ఎందుకు చేయాల్సి వచ్చింది.. అందుకోసం అనుసరించిన వ్యూహమేంటి.. ఎవరెవరు.. ఎలా ఈ ఆపరేషన్ ను అమలు చేశారు.. వంటి వివరాలు బయటకువచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన హైదరాబాద్ టాస్క్‌ ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావు (DCP Radhakishan Rao) కీలక విషయాలకు దర్యాప్తు అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో స్వయంగా తెలిపారు. 

టాస్క్‌ ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావు ఏంచెప్పారంటే.. కేసీఆర్‌ తనపైన లేదంట్ ప్రభుత్వంపైన కొద్దిపాటి విమర్శ వచ్చినా చిరాకుపడేవారు.. అందుకే ప్రతిపక్ష నాయకులను ఎప్పటికప్పుడు గమనించేందుకు ఎస్‌ఐబీ డీఎస్పీ ప్రణీత్‌ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఎస్‌ఐబీ ఐజీ ప్రభాకర్‌ రావు ఏర్పాటు చేసిన తర్వాత నేను కూడా ఆయనతో కలిసి పనిచేయడం ప్రారంభించాను. తెలంగాణలోని పలు రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యమైన లీడర్ల ఫోన్లను పర్యవేక్షించడం ద్వారా సేకరించిన సమాచారాన్ని ప్రణీత్‌ రావు నాకు పంపేంచేవారు.

కొన్ని సందర్భాల్లో ఇలాంటి సమాచారాన్ని పోలీసు కమిషనర్‌ కు పంపాలని ప్రణీత్‌ రావుకు చెప్పేవాడిని. కమిషనర్‌ ఆదేశాల ప్రకారమే టాస్క్‌ ఫోర్స్‌ పనిచేస్తోందని నమ్మించేందుకే ఇలా చేసేవాళ్లం.. ప్రతిపక్షాలకు చెందిన డబ్బు పట్టుకోవడం, బీఆర్ఎస్ అవసరాల కోసం అందుతున్న డబ్బు ఎలాంటి అవాంతరం లేకుండా రవాణా అయ్యేలా చూడటంలో ప్రణీత్‌ రావుతో కలిసి పనిచేయాలని ప్రభాకర్‌ రావు నన్ను ఆదేశించారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొదలైన ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్ 2019 లోక్‌సభ ఎన్నికలు, తరువాత జరిగిన ఉప ఎన్నికలు, 2023 ఎన్నికల్లోనూ కొనసాగింది. 2020లో పదవీ విరమణ చేసిన తర్వాత కేసీఆర్‌ ఆశీస్సులతో ప్రభాకర్‌ రావు మళ్లీ ఎస్‌ఐబీ అధినేతగా నియమితులయ్యారు.

అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు టి.రాజయ్య, పట్నం మహేందర్‌ రెడ్డి, బీఎస్పీ నేత ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్, బీజేపీ నేతలు ఈటల రాజేందర్, బండి సంజయ్, కాంగ్రెస్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్‌ తదితరులు ఇందులో ఉన్నారు. వ్యాపారులు, రియల్ ఎస్టేట్ సంస్థల వారినీ పర్యవేక్షించారు. రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి, బీఆర్ఎస్ కు, పార్టీ నేతలకు ముప్పుగా భావించే నాయకులకు సంబంధించిన సమాచారం సేకరణపై ప్రభాకర్‌రావు నాతో తరచూ మాట్లాడేవారు. విషయాలను ప్రణీత్‌ రావుతోనూ ఎప్పటికప్పుడు పంచుకునేవారు. వీటి ఆధారంగా ప్రణీత్‌రావు ఆయా నాయకులను పర్యవేక్షిస్తూ (ఫోన్‌ట్యాపింగ్‌) ఉండేవారుఅని విచారణలో చెప్పుకొచ్చారు రాధాకిషన్ రావు.


 

 


Comment As:

Comment (0)