ఏపీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ సెక్రెటరిగా పనిచేసిన పీవీ రమేశ్
చంద్రబాబుకై కేసు పెట్టడం ఆశ్చర్యం- రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేశ్
స్పెషల్ రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) రిమాండ్ నేపధ్యంలో అప్పటి ఆర్ధిక శాఖ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారు పీవీ రమేశ్ (PV Ramesh) ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన స్టేట్మెంట్ ఆధారంగానే కేసు పెట్టామని ఏపీ సీఐడీ చెప్పడం దిగ్భ్రాంతికరమని పీవీ రమేశ్ అన్నారు. ఈ కేసుకు సంబందించి గతంలో ఆయన సీఐడీకి లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. తాజాగా చంద్రబాబు అరెస్ట్ తదితర పరిణామాల నేపథ్యంలో పీవీ రమేశ్ స్పందించారు.
తన వాంగ్మూలంతోనే చంద్రబాబును అరెస్ట్ చేశామని సీఐడీ అధికారులు చెప్పడం హ్యాస్యాస్పదమని పీవీ రమేశ్ (PV Ramesh, IAS) అన్నారు. తాను అప్రూవర్ గా మారారనే ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని చెప్పారు. అసలు ఫైలే లేకుండా కేసులు ఎలా పెడతారని పీవీ రమేశ్ ప్రశ్నించారు. స్కిల్ డెవలప్ మెంట్లో ఆర్థిక శాఖ ఏ తప్పూ చేయలేదన్న ఆయన.. సీఐడీ తీరుపై అనుమానం కలుగుతుందని చెప్పారు. తాను చెప్పింది సీఐడీ తనకు అనుకూలంగా మార్చుకుందని అనుమానం వ్యక్తం చేసిన పీవీ రమేశ్.. గతంలో నిధులు విడుదల చేసిన వారిలో కొందరి పేర్లు కేసులో లేవని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ ఎండీ, కార్యదర్శి పాత్ర ముఖ్యమని.. కానీ ఈ కేసులో వారి పేర్లు ఎందుకు లేవని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి పదవిలో ఉండేవారు కొన్ని వందల అంశాలను పర్యవేక్షిస్తారని.. కానీ ఆయా అంశాలకు సంబందించి ఆయా శాఖల అధికారులే ప్రధాన బాధ్యత వహించాలని పీవీ రమేశ్ చెప్పారు. ప్రతి బ్యాంక్ అకౌంట్ లో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రికి ఎలా తెలుస్తుందని అన్నారు. ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ పై విధాన నిర్ణయం తీసుకున్న ఫైల్స్ ఏమయ్యాయని పీవీ రమేశ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అధికారుల మీద ఒత్తిడితెచ్చి డబ్బులు రిలీజ్ చేయించడం ఎక్కడా జరగదని స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ పై రాసిన నోట్ ఫైల్స్ ఏమయ్యాయని ప్రశ్నించిన ఆయన, తప్పు చేసిన అధికారులను కాకుండా మాజీ సీఎంను అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. కొంత మంది అధికారుల చేసిన తప్పులను మాజీ ముఖ్యమంత్రి కి ఎలా ఆపాదిస్తారని పీవీ రమేశ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.