జైలు అధికారులకు ఏసీబీ కోర్టు ఆదేశం
జైలులో చంద్రబాబుకు ప్రత్యేక సౌకర్యాలు
రాజమహేంద్రవరం రిపోర్ట్- టీడీపీ అదినేత చంద్రబాబుకు (Chandrababu) రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో (Rajahmundry Central Jail) ప్రత్యేక వసతులు కల్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. అత్యంత కట్టుదిట్టమైన జడ్ ప్లస్ భద్రతలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు రాజమండ్రి జైలులో అవసరమైన అన్ని ప్రత్యేక సౌకర్యాలను కల్పించాలని జైలు సూపరింటెండెంట్‌ను ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి హిమబిందు ఆదేశించారు. చంద్రబాబుకు ప్రాణహాని ఉన్నందున జైల్లో ఆయనకు ప్రత్యేక గదిని కేటాయించడంతో పాటు, తగిన భద్రతనూ కల్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. చంద్రబాబు ఇంటి నుంచి వచ్చిన ఆహారం, ఔషధాలనూ అనుమతించాలని స్పష్టం చేశారు. జైల్లో చంద్రబాబుకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించేలా ఆదేశించాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మావోయిస్టులు, రాజకీయ ప్రత్యర్థులు, ఇతర వర్గాల నుంచి చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం ఆయనకు జడ్ ప్లస్ భద్రతను కల్పించిని విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందుకే రాజమహేంద్రవరం జైలులో రెగ్యులర్ బ్లాక్ లో ఇతర ఖైదీలతో కలిపి ఉంచితే ఆయన ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పిటీషన్ లో పేర్కొన్నారు. చంద్రబాబుకు 73 ఏళ్ల వయస్సు తో పాటు పలు రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న నేపధ్యంలో ఆయన వైద్యులు సూచించిన ఆహారాన్ని తీసుకోవడంతో పాటు మందులు కూడా వాడాల్సి ఉందని న్యామూర్తికి విన్నవించారు. మాజీ సీఎం, ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు జైలు నిబంధనల ప్రకారం ప్రత్యేక సౌకర్యాలకు అర్హులన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందుకే చంద్రబాబుకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని పిటీషన్ లో పేర్కొనగా.. ఏసీబీ కోర్టు ఈ మేరకు చంద్రబాబుతు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని జైలు అధికారులను ఆదేశించింది