చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
నేషనల్ రిపోర్ట్- మహిళా రిజర్వేషన్లకు (Womens Reservation Bill) సంబందించిన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సోమవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ (Prahlad Singh Patel) మహిళా రిజర్వేషన్ బిల్లుపై ట్వీట్ చేశారు. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ డిమాండ్ ను మోదీ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆయన పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్ డిమాండ్ ను నెరవేర్చే ధైర్యం మోదీ ప్రభుత్వానికే ఉందని చెప్పారు. మంత్రివర్గ ఆమోదంతో ఇది రుజువైందని ప్రహ్లాద్ సింగ్ పటేల్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన మోదీ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు చెప్పారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సమయంలో కీలకమైన మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపడం ఆసక్తికరంగా మారింది. ఈ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందితే, లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలుకానున్నాయి.
మహిళా రిజర్వేషన్లు బిల్లును (Womens Reservation Bill) 1996లో హెచ్‌డీ దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం మొట్టమొదటిసారి లోక్ సభలో ప్రవేశపెట్టింది. ఆ తరువాత వాజ్‌పేయీ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలోనూ పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పటికీ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందలేదు. ఈ క్రమంలో 2010లో మహిళా బిల్లు రాజ్యసభ ఆమోదం పొందినా లోక్‌సభ ఆమోదం పొందలేకపోయింది. 2014లో లోక్ సభ రద్దుకావడంతో అక్కడ బిల్లు పెండింగ్ లో ఉండిపోయింది. ఇదిగో ఇప్పుడు మోదీ సారథ్యంలోని మంత్రివర్గం మహిళా రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకోవడంతో ప్రస్తుతం జరగుతున్న లోక్ సభ సమావేశాల్లో ఈ బిల్లుకు ఆమోదం లభించే అవకాశం ఉంది.