ట్విట్టర్ లో ఫొటోలు షేర్ చేసిన నాగార్జున
అక్కినేని నాగచైతన్య - శోభిత నిశ్చితార్థం..
అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు. హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala)ను నాగచైతన్య వివాహమాడనున్నారు. ఈమేరకు నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల వివాహ నిశ్చితార్థం జరిగింది. తన కొడుకు నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం ఈరోజు ఉదయం 9.42 గంటలకు జరిగిందని అక్కినేని నాగార్జున ట్విట్టర్-ఎక్స్ లో పేర్కొన్నారు. ఈ విషయాన్నిఅందరితో పంచుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. మా కుటుంబంలోకి ఆమెను సంతోషంగా ఆహ్వానిస్తున్నామని చెప్పిన నాగార్జున.. నూతన జంటకు అభినందనలు తెలిపారు. వీరి జీవితం సంతోషం, ప్రేమతో నిండాలని కోరుకుంటున్నాని దీవించారు.
నాగచైతన్య, శోభితా వివాహ నిశ్చితార్ధానితి సంబంధించిన ఫొటోలను నాగార్జున సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. నాగ చైతన్యకు గతంలో నటి సమంతతో పెళ్లికాగా వ్యక్తిగత కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు. నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల చాలా కాలం నుంచి స్నేహితులుగా ఉంటూ వస్తున్నారు. ఇదిగో ఇప్పుడు ఇరు కుటుంబాల అంగీకారంతో ఒక్కటి కాబోతున్నారు. ఇక శోభిత ధూళిపాళ్ల 2013 లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలిచింది.
2016 లో సినీ రంగ ప్రవేశం చేసిన శోభిత ధూళిపాళ్ల మేజర్, గూడాచారి వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ నటిస్తోందామే. మరోవైపు నాగచైతన్య తాజా మూవీ తండేల్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. నాగచైతన్య, శోభితా వివాహ నిశ్చితార్ధం సందర్బంగా అక్కినేని అభిమానులు సోషల్ మీడియా ద్వార శుభాకాంక్షలు చెబుతున్నారు.