Tree

నేలకొరిగిన 150 ఏళ్ల సినిమా చెట్టు

ఆంధ్రప్రదేశ్‌ లోని రాజమండ్రి సమీపంలో గోదారి గట్టున చారిత్రాత్మకమైన భారీ వృక్షం నేలకొరిగింది. సుమారు 150 ఏళ్లకు పైగా గోదారి గట్టున సగర్వంగా నిలిచిన మహా వృక్షం కుప్పకూలిపోయింది. ఎన్నో ప్రకృతి విపత్తులను, గోదావరి వరదలను ఎదుర్కొని నిలిచిన ఈ మహా వృక్షం నేలకూలిపోవడం అందరిని కలిచివేస్తోంది.

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో గోదావరి ఒడ్డున 150 ఏళ్లకు పైగా నిటారుగా నిలుచున్నదీ నిద్రగన్నేరు వృక్షం. ఈ చెట్టును స్థానికంగా సినిమా చెట్టు అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్ లు జరిగాయి. సుమారు 300 లకు పైగా సినిమాలు ఈ మహా వృక్షం దగ్గర చిత్రీకరణ జరుపుకున్నాయి. ఈ మహా వృక్షం ఎన్నో సన్నివేశాలకు కొత్త అందాల్ని అద్దింది.

ప్రముఖ దర్శకులు బాపు, కె. విశ్వనాథ్, కె. రాఘవేంద్ర రావు తదితరులు తమ సినిమాల్లోని చాలా సన్నివేశాల్ని ఈ నిద్రగన్నేరు చెట్టు దగ్గర చిత్రీకరించారు. అక్కినేని నాగేశ్వరరావు నుంచి మొదలు కొని క్రిష్ణంరాజు, క్రిష్ణ, చిరంజీవి, బాలక్రిష్ణ, మోహన్ బాబు తదితర అగ్రహీరోల సినిమాలను ఇక్కడే షూట్ చేశారు. 1975 లో విడుదలైన పాడి పంటలు సినిమాలో చెట్టు హైలెట్ గా నిలిచింది. తర్వాత పలు సినిమా షూటింగ్ లు భారీ చెట్టు బ్యాక్ గ్రౌండ్ లో జరిగేవి.

అక్కినేని నాగేశ్వర రావు, మీనా కాంబినేషన్ లో వచ్చిన సీతారామయ్యగారి మనవరాలు సినిమాలోని కీలక సన్నివేశాలు ఈ నిద్రగన్నేరు చెట్టు దగ్గరే చిత్రీకరించారు. ఎన్నో వందల సినిమాలకు సాక్ష్యంగా నిలిచిన మహా వృక్షం ఇప్పుడు నెలకరగడంతో అంతా  ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం గోదారి వరదలకు గట్టు కొద్దికొద్దిగా దిగబడి, చివరకు చెట్టు మొదలు రెండుగా చీలిపోవటంతో నేలకొరిగింది.


Comment As:

Comment (0)