మళ్లీ భువికి వస్తావుగా..

news02 Feb. 25, 2018, 8:13 a.m. entertainment

సినిమా పిల్లర్- శ్రీదేవి.. ఆమె అభిమానులకు ఇదో మంత్రం... ఆమె అందం.. ఫ్యాన్స్ మనసులకో బంధం.. ఆమె అభినయం.. సినీ వీక్షకుల కనువిందం.. ఆమె లేని లోటు ఉహించుకోవాలంటేనే... అసలు ఆ ఉహే రావడం లేదు.. కోట్ల మంది హృదయాలను కొల్లగొట్టిన శ్రీదేవి... ఇప్పుడు వారందరి గుండెల్నిండా విషాదాన్ని నింపింది. 

శ్రీదేవి.... నీవు వెండితెరపై ఎన్ని సినిమాల్లోనైనా నటించి ఉండవచ్చు... పాత్రలెన్నైనా చేసి ఉండవచ్చు... ఇక నీవు చేసిన పాత్రలకు ఎన్ని అవార్డులైనా వచ్చి ఉండవచ్చు. ఐతే మా సినీ ప్రేక్షకులకు, అభిమానులకు ఇప్పటికీ నువ్వు దేవలోకం నుంచి దిగివచ్చిన ఇంద్రజవే. 
‘కార్యార్థివై ఈ భూలోక అడుగిడినావా’...  ఓ శ్రీదేవి.. నీవు నిజంగా  దేవలోకం నుంచి భూమి మీదకు వచ్చి ఉంగరం పోగొట్టుకుని ఇన్నాళ్లూ ఇక్కడ ఉండిపోయావా. ఇంత త్వరగా మమ్మల్ని వదిలేసి నువ్వు వెళ్లిపోవడంతో మా హృదయాు తల్లడిల్లిపోతున్నాయి. ఇన్నాళ్ల తరువాత నీకు గానీ ఆ ఉంగరం దొరికిందా... దాని తీసుకుని నువ్వు దేవలోకానికి వెళ్లిపోయావా.. 
శ్రీదేవి.. జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాలోలాగా, ఆ ఉంగరం సముద్రంలో పడేసి మాతో ఉండిపోవచ్చుగా..’. ‘కథగా కల్పనగా కనిపించిన ఓ దొరసాని’.. ‘వసంతకోకిల’లాంటి నీ పలుకులు ఇక వినలేమంటేనే తట్టుకోలేకపోతున్నాము.. నువ్వు ఈలోకాన్ని విడిచి వెళ్లిపోయావంటే నిజంగా నిజంగా ‘కథగా.. కల్పనగానే’ ఉంది.

బూచాడమ్మా బూచాడు బుల్లిపెట్టెలో ఉన్నాడు’ అంటూ మొన్ననే నువ్వు పాడినట్టు ఉంది. ‘సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా’ అంటూ ‘పదహారేళ్ల వయసు’లో నువ్వు వూయల వూగుతూ పాడుతుంటే ఆ దృశ్యం ఇంకా మా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఇప్పటికీ ఈడువచ్చిన కన్నెపిల్లలంతా ఈ పాట పాడుకుంటూ నిన్నే వూహించుకుంటుంది. అప్పట్లో ప్రతీ మగాడి ‘అందాల దేవత’వు నువ్వే కదా. ఏ అమ్మాయిని చూసి వర్ణించాలన్నా ‘శ్రీదేవిలా ఉందిరా’ అని నీపేరే చెప్పేవాళ్లు కదా. 
శ్రీదేవి.. నిన్ను గుర్తు చేసుకుంటూనే తన ప్రియురాలిని ‘నీ కళ్లు చెబుతున్నాయి.. నిను ప్రేమించానని’ అంటూ పాడుకుంటూ ఉండేవాళ్లు. వారి ‘హృదయ’ దేవతకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన నువ్వు లేవని తెలిస్తే ఆ హృదయాలు తట్టుకోగలవా చెప్పు.. ‘

శ్రీదేవి..  వెల్లువచ్చి గోదారమ్మా ఎల్లికలా పడ్డాదమ్మో’ అంటూ ఆ బిందెల మధ్య నుంచి నువ్వు పరిగెత్తుకుంటూ వస్తుంటే చూసిన వాడి గుండెల జారిపోతాయంతే.. ఇప్పుడంటే ప్రియా ప్రకాష్‌ వారియర్‌ కన్నుకొట్టి సోషల్‌మీడియా సంచలనం అయింది కానీ, అప్పట్లోనే నువ్వు కన్నుకొట్టి యువ హృదయాలను దోచుకుంది నిజం కాదా.. అందుకు కదా ‘కుడికన్ను కొట్టగానే కుర్రాడిని.. ఎడమకన్ను కొట్టగానే ఎర్రోడిని’ అని శోభన్‌బాబు లాంటివాళ్లేందరో నీకు ఫిదా అయ్యారుయ.
 ‘ఇంద్రజ’ నీ రాకకోసం వేయికళ్లతో ఎదురుచూస్తుంటాం. త్వరగా దేవేంద్రుడి అనుమతి తీసుకుని ‘మానవ మానవ’ అంటూ మళ్లీ మమ్మల్ని వెతుక్కుంటూ ఈ భూలోకానికి వస్తావని ఎదురుచూస్తూ ఉంటారు నిన్ను ఆరాదించేవాళ్లందరు. వస్తావు కదూ....

Related Post