ముక్కున వేలేసుకున్న స్థానికులు

news02 May 8, 2018, 4:01 p.m. general

snake treatment
ఏలూరు: మామూలుగా మ‌న‌కు మ‌నుషుల‌కు స‌ర్జ‌రీలు చేయ‌డం తెలుసు.  ఇంకా చెప్పాలంటే పెంపుడు జంతువుల‌కు శ‌స్త్ర చికిత్స‌లు చేయ‌డం గురించి తెలుసు. అవ‌య‌వాలు దెబ్బ‌తిన్న‌ప్పుడు, ఆక్సిడెంట్లు జ‌రిగిన‌ప్పుడు, దీర్ఘ‌కాలిక వ్యాధులు సోకిన‌ప్పుడు వైద్యులు ఆప‌రేష‌న్లు చేస్తుంటారు. ఇలాంటీ స‌ర్జ‌రీలు ప‌రిపాటిగా జ‌రిగేవే. అయితే మ‌నుషులు, పెంపుడు జంతువులకే స‌ర్జ‌రీలు కాకుండా పాముల‌కు ఆప‌రేష‌న్లు చేయ‌డం గురించి ఎప్పుడైనా విన్నారా అంటే... చాలా మంది వినలేద‌నే చెబుతారు. పాము పేరు చెబితేనే చాలా మంది ఆమ‌డ దూరం పారిపోతుంటారు. ద‌గ్గ‌ర‌కు పోతే ఎక్క‌డ కాటేసి ప్రాణం తీస్తోందోన‌ని భ‌యంతో ప‌రుగులు పెడుతారు. అలాంటిది ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా జంగారెడ్డిగూడెంలో పాముకు శ‌స్త్ర చికిత్స చేయించి బ‌తికించ‌డం స్థానికంగా హాట్ టాపిక్‌గా  మారింది. 

snake treatment 2

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా జంగారెడ్డిగూడెం రామ‌చంద్రపురంలోని బ్ర‌హ్మ‌నంద‌రావు ఇంట్లో 6 అడుగుల పాము బీరువా కింద దూరింది. పాము ఇంట్లో దూరిన విష‌యాన్నిగ‌మ‌నించిన బ్ర‌హ్మ‌నంద‌రావు కుటుంబ స‌భ్యులు.. స్నేక్ సేవియ‌ర్ సొసైటీ వ్య‌వ‌స్థాప‌కులు చ‌ద‌ల‌వాడ క్రాంతికి స‌మాచారం అందించారు. అయితే క్రాంతి వ‌చ్చే లోపే పాము బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో.. క‌ర్రతో ఓదెబ్బ కొట్టారు. దీంతో పాము న‌డుం భాగం దెబ్బ‌తింది. అయితే అక్క‌డికి వ‌చ్చిన స్నేక్ సేవియ‌ర్ సొసైటీ వ్య‌వ‌స్థాప‌కులు చ‌ద‌ల‌వాడ క్రాంతి దానికి ప్రాథ‌మిక చికిత్స చేశారు. 

snake treatment

అనంత‌రం పామును క్రాంతి ప‌శువైద్యుల‌కు అప్ప‌గించారు. అయితే పాముకు ప‌శువైద్యులు విజ‌య‌వంతంగా ఆప‌రేష‌న్ పూర్తి చేశారు. న‌డుంపై 8 కుట్లు వేసి ప‌శు వైద్యులు సోమేశ్వ‌ర‌రావు స‌ర్జ‌రీ నిర్వ‌హించారు. 15 రోజుల పాటు పాముకు  రెస్ట్ ఇస్తే స‌రిపోతుంద‌ని వెల్ల‌డించారు. 

అయితే పాముకు స‌ర్జ‌రీ చేయ‌డంపై స్థానికులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. పామును ఎక్క‌డైనా విష పురుగుగా భావించి కొట్టి చంపేస్తాం.. కానీ, ఆప‌రేష‌న్ చేసి బ‌తికించ‌డంపై విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. శ‌త్రువునైనా మిత్రుడుగా చూడాల‌న్న విధంగా పామును కాపాడిన చ‌ద‌ల‌వాడ క్రాంతిని స్థానికులు అభినందిస్తున్నారు. 

tags: snakesugery,snake,chadalavadakranti,eluru,westgodavari,snakesafesociety,weternydoctors

Related Post