సుప్రీం కోర్టుకు కృతజ్ఞతలు చెప్పిన కేటీఆర్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (Kavitha Bail) సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఆమె సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సుప్రీం కోర్టుకు ధన్యవాదాలు తెలిపారాయన. థాంక్యూ సుప్రీం కోర్టు.. ఊరట లభించింది.. న్యాయం గెలిచింది.. అని కేటీఆర్ ట్విట్టర్-ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఐతే ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయటంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. సుప్రీం కోర్టుకు ఉద్దేశాలు ఆపాదించేలా వ్యాఖ్యలు చేశారని బండి సంజయ్ పై ఫైర్ అయ్యారు. కేంద్ర మంత్రిగా ఉంటూ ఇంత చౌకబారుగా మాట్లాడుతారా అని కేటీఆర్ విమర్శించారు. దురుద్దేశపూర్వకంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ట్విట్టర్- ఎక్స్ వేదికగా స్పందించారు. బండి సంజయ్ ఏమన్నారంటే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి బెయిల్ లభించినందుకు కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ న్యాయవాదులకు అభినందనలు.. మీ అలుపెరగని ప్రయత్నాలు చివరకు ఫలించాయి.. ఈ బెయిల్ బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండింటికీ విజయం.. బీఆర్ఎస్ లీడర్ బెయిల్‌పై బయటకు రాబోతున్నారు.. కాంగ్రెస్ వ్యక్తి రాజ్యసభకు ఎంపికయ్యారు.. బెయిల్ కోసం మొదట వాదించిన వ్యక్తి పోటీ చేస్తే.. ఆ అభ్యర్థికి మద్దతు ఇచ్చి కేసీఆర్ రాజకీయ చతురత ప్రదర్శించారు.. అని అన్నారు బండి సంజయ్. ఈ వ్యాఖ్యలపైనే కేటీఆర్ మండిపడ్డారు.