కెల్విన్‌తో పూరీకి సంబంధంపైనే ఆరా!

హైదరాబాద్‌: మాదకద్రవ్యాల కేసులో సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో సిట్‌ అధికారుల విచారణ ఈ ఉదయం నుంచి కొనసాగుతోంది. విచారణలో భాగంగా ఉదయం 10 గంటలకు నాంపల్లి ఆబ్కారీ శాఖ కమిషనర్‌ కార్యాలయానికి పూరీ జగన్నాథ్‌ తన కుమారుడు ఆకాశ్‌, సోదరుడు సాయిరామ్‌లతో కలిసి వచ్చారు. పూరీని సిట్‌ కార్యాలయంలోని ఐదో అంత‌స్తులో విచారిస్తున్నారు. అకున్‌ సబర్వాల్‌ పర్యవేక్షణలో నలుగురు అధికారుల బృందం ఆయనను విచారిస్తున్నట్టు సమాచారం. ఈ విచారణలో ప్రధానంగా డ్రగ్‌ ముఠా నాయకుడు కెల్విన్‌తో ఏర్పడిన సంబంధాలు, డ్రగ్స్‌ అలవాటు, మద్యం తాగే అలవాటు, పూరీ జీవన శైలికి సంబంధించిన పలు ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. మొత్తంగా చూసినప్పుడు కెల్విన్‌తో ఉన్న సంబంధాలపైనే ప్రధానంగా ఆరా తీస్తున్నట్టు సమాచారం. కెల్విన్‌తో ఓ ఈవెంట్‌ మేనేజర్‌ ద్వారా తనకు పరిచయం ఏర్పడిందని పూరీ అధికారులతో చెప్పినట్టు తెలుస్తోంది. మరికొన్ని గంటలపాటు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు కావాలని భావిస్తే విచారణ సమయం పెంచే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పూరీని అరెస్టుచేసే అవకాశం లేదని తెలుస్తోంది. కెల్విన్‌తో ఉన్న సంబంధాలు, సినీ పరిశ్రమలో డ్రగ్స్‌ వాడకంపై ఇతర కోణాల్లో దర్యాప్తు చేసేందుకే ఈ విచారణ చేపట్టారు. ఆయన ఇచ్చిన సమాచారాన్ని తదుపరి దర్యాప్తునకు ఉపయోగించుకొని, ఆయనను సాక్షిగా పేర్కొనే అంశంపై అధికారులు ఓ నిర్థారణకు రానున్నారు. మాదకద్రవ్యాల ముఠాతో ఎలాంటి సంబంధంలేదని పూరీ ఇప్పటికే అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. పూరీ ద్వారానే ఛార్మి, రవితేజకు డ్రగ్‌ ముఠాతో సంబంధాలు ఏర్పడినట్టుఅధికారులు భావిస్తున్నారు.


Leave your comment