పూర్ణిమసాయిపై.. టీవీ నటి ప్రభావం!

నలభై రోజుల క్రితం అదృశ్యమై..ముంయికి చేరిన పూర్ణిమసాయి(15) ఎట్టకేలకు మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్‌కు చేరుకుంది. తల్లిదండ్రులను చూసేందుకూ ఆసక్తి చూపని కారణంగా పోలీసులు బాలికను నేరుగా బాలికా సదన్‌కు తరలించారు. ఇదిలా ఉంటే.. ఇంట్లో ఉంటే తల్లిదండ్రులకు అరిష్టమనే కారణంతోనే తాను వెళ్లిపోయినట్లు చెబుతున్నా..పూర్ణిమ ముంబయికి వెళ్లడం వెనక బలమైన కారణాలే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు..చిన్ననాటి నుంచి నటనపై ఆసక్తి ఉన్న పూర్ణిమ..ఈ క్రమంలోనే టీవీ నటి సురభిచందన నటనకు ప్రభావితమైంది. తన తల్లి స్మార్ట్‌ఫోన్‌లోని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ నటితో పలుమార్లు చాటింగ్‌ చేసింది. ‘ఐ యామ్‌ బిగ్‌ ఫ్యాన్‌ ఆఫ్‌ యూ’, ఐ లవ్‌ యువర్‌ యాక్టింగ్‌’ అంటూ బాలిక చేసిన చాటింగ్‌ తాలూకూ వివరాల్ని పోలీసులు గుర్తించారు. అందుకు ప్రతిగా సురభి సైతం ‘థాంక్యూ’ అంటూ సమాధానమిచ్చారు. ఇలా సురభిచందనకు బాలిక అభిమానిగా మారింది. స్టార్‌ప్లస్‌లో ప్రముఖ షో ‘ఇష్క్‌బాజ్‌’లో సురభిచందన ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ షోలో ఆమె పాత్ర పేరు ‘అనికా’. అందుకే ముంబయి దాదార్‌లో చేరిన హోంలో తన పేరును అనికాశ్రీగా బాలిక పేర్కొంది. తల్లిదండ్రులపై ఎందుకంత విముఖత? కుమార్తె ముంబయిలో ఉన్నట్లు తెలిసి అక్కడికి వెళ్లిన తల్లిదండ్రులను కనీసం కలిసేందుకూ పూర్ణిమ నిరాకరించడానికి గల కారణలేమిటన్నది ప్రస్తుతం పోలీసు అధికారుల్లో చర్చనీయాంశమైంది. తల్లిదండ్రులకు అరిష్టమనే కారణాన్ని బాలిక చూపుతున్నా..బయటికి చెప్పుకోలేని కారణమేదో ఉండి ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ ఖాతాల్ని తొలగించడం ద్వారా పూర్ణిమ తెలివైనదనే అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో..కుటుంబం పట్ల ఏహ్యభావం ప్రదర్శించడం వెనక లోతైన కారణాలే ఉంటాయన్న భావన వారిలో వ్యక్తమవుతోంది. ఏదేమైనా ముంబయి నుంచి బాలికను మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్‌కు తీసుకొచ్చిన బాచుపల్లి పోలీసులు..నింబోలిఅడ్డలోని ప్రభుత్వ బాలికల సదన్‌లో ఉంచారు. బాలిక భవితవ్యంపై ఉత్కంఠ రంగారెడ్డి జిల్లా బాలికా సంరక్షణ కమిటీ(సీడబ్ల్యూసీ) ముందు బుధవారం పూర్ణిమను హాజరుపరచనున్నారు. ఈ కమిటీ సభ్యులు బాలికతో మాట్లాడిన అనంతరం ఆమె భవితవ్యంపై స్పష్టత రానుంది. కమిటీ కౌన్సెలింగ్‌ నిర్వహించిన అనంతరమూ తల్లిదండ్రులతో వెళ్లేందుకు పూర్ణిమ నిరాకరిస్తే ఆమెను హోంలోనే ఉంచి చదివించే అవకాశాలున్నాయి. ఒకవేళ బాలిక ఇంటికి వెళ్లనని స్పష్టం చేస్తే అందుకు గల కారణాలపైనా కమిటీ ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా బాలిక కుటుంబ నేపథ్యం, ఇప్పటివరకు చదివిన పాఠశాలలో ఆమె వ్యవహారశైలి తదితరాలను పరిశీలించడంతోపాటు..బాలిక నుంచీ సమాచారం సేకరిస్తారని సమాచారం.


Leave your comment