వీసా ఉంటే అదనపు పత్రాలు అవసరం లేదు!

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికా వీసాలకు సంబంధించి వివిధ అంశాలపై ‘అమెరికాయానం’ పేరిట పాఠకుల నుంచి ‘ఈనాడు’ ఆహ్వానించిన ప్రశ్నలకు... హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ అధికారులు సమాధానాలిచ్చారు. అవి ఇలా ఉన్నాయి... ప్రైవేటు బ్యాంకులో పని చేస్తున్నాను. నా సోదరుడు హెచ్‌1బి వీసాపై అమెరికాలో పని చేస్తున్నారు. నేనూ అమెరికాలో పని చేయాలనుకుంటున్నాను. హెచ్‌1బి వీసా విధానం ఏమిటి? - బద్రీ అమెరికాలో హెచ్‌1బి వీసాపై పని చేయాలంటే మీ పక్షాన అక్కడి యాజమాన్యం ఉద్యోగ పిటిషన్‌ దాఖలు చేయాలి. దాన్ని సమీక్షించిన మీదట అన్నీ సానుకూలంగా ఉంటే యునైటెడ్‌ స్టేట్స్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) ఆమోదిస్తుంది. అమెరికాలో పని చేసేందుకు మరింత సమాచారం కోసం https://www.uscis.gov/working-united-states/working-US వెబ్‌సైట్‌ను చూడండి. వీసా దరఖాస్తు వివరాల కోసం www.ustraveldolcs.com/ in పరిశీలించండి. నాకు బి1/బి2 వీసా వచ్చింది. మేరిల్యాండ్‌లో నివాసం ఉంటున్న నా సోదరుడిని చూసేందుకు వెళ్లాలనుకుంటున్నాను. పాస్‌పోర్టు కాకుండా ఏయే పత్రాలను వెంట తీసుకెళ్లాలి. అమెరికాలో ఎన్ని రోజులు ఉండవచ్చు? - పిల్లలమర్రి వెంకట నరసింహమూర్తి మీకు ఇప్పటికే వీసా ఉంటే అమెరికా ప్రవేశ ప్రాంతం వరకు వెళ్లేందుకు ఎలాంటి ధ్రువపత్రాలు అవసరం లేదు. అమెరికాలో ప్రవేశం, ఎంత కాలం ఉండవచ్చు అన్నది ప్రవేశప్రాంతంలోని కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌(సీబీపీ) అధికారులు నిర్ణయిస్తారు. పర్యాటక వీసా కోసం దరఖాస్తు చేయాలంటే అన్‌లైన్‌ ద్వారా డీఎస్‌-160 భర్తీ చేయాల్సి ఉంటుంది. వీరిని ఇంటర్వ్యూ అధికారి అదనపు పత్రాలను అరుదుగా కోరుతారు. అదనపు ధ్రువపత్రాలు అవసరమనుకుంటే వెంట తెచ్చుకోవచ్చు. నేను క్రైస్తవ పూజారిని. అమెరికా నుంచి ఆహ్వానం లభించింది. ఎలాంటి వీసాకు దరఖాస్తు చేయాలి? - గ్రేస్‌ విక్టర్‌ ఏ వీసాకు దరఖాస్తు చేయాలనేది మీ పర్యటన కారణమేంటన్న అంశంపై ఆధారపడి ఉంటుంది. వివిధ రకాల వీసాలు, వీసా కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకునేందుకు www.ustraveldocs.com/inను చూడండి. హెచ్‌1బి వీసాపై అమెరికాలో ఆరేళ్లు ఉన్నాను. వ్యక్తిగత కారణాలతో 2007లో భారతదేశానికి తిరిగి వచ్చాను. వచ్చేముందు ఈబీ-3 విభాగంలో థర్డ్‌పార్టీ ద్వారా లేబర్‌ మరియు ఐ-140 దరఖాస్తు చేశాను. ఈబీ-3 తేదీలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. భారతదేశం నుంచి ఐ-485ని ఎలా దరఖాస్తు చేసుకోవాలి? విధి విధానాలేమిటి? - సాయి ఇమిగ్రెంట్‌ వీసా ప్రక్రియను హైదరాబాద్‌ కాన్సులేట్‌ నిర్వహించదు. దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం, ముంబయిలోని కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయాల్లో మాత్రమే ఇమిగ్రెంట్‌ వీసాల ప్రక్రియను నిర్వహిస్తారు. మరింత సమాచారం కోసం https:// in.usembassy.gov/visas/ immigratnt-visas ను చూడండి. * వీసాలకు సంబంధించిన నిర్దుష్టమైన అంశాలు, తిరస్కారాలపై సందేహాలనుsupport-india@ustraveldocs.comకు ఈ-మెయిల్‌ చేేయండి. * మరింత సమాచారం కోసం హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ వెబ్‌సైట్‌ http://hyderabad.usconsulate.govను సంప్రదించవచ్చు. * హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం అందించే వీసా తదితర సేవలకు సంబంధించిన ప్రశ్నలను usvisa@eenadu.netకు పంపగలరు.


Leave your comment