ఆసీస్‌తో సెమీస్‌కు మిథాలీ ‘సైన్యం’ సిద్ధమా!

అటువైపు ఆరుసార్లు ప్రపంచకప్‌ గెలిచిన పటిష్ఠ జట్టు. ఇటువైపు ఈసారైనా ప్రపంచకప్‌ ముద్దాడాలని కసితో ఉరకలేస్తున్న జట్టు. ఆ జట్టు డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగింది. ఈ జట్టు గత టోర్నీలో ఏడో స్థానంలో నిలిచింది. అది మహిళల క్రికెట్‌ను శాసిస్తున్న బృందం ఇది మహిళల క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే వరుస విజయాలు సాధిస్తూ వూపుమీద ఉన్న బృందం ఇంగ్లాండ్‌లో నిర్వహిస్తున్న ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌లో తలపడుతున్న ఆ రెండు జట్లే ఆస్ట్రేలియా, భారత్‌. గురువారం జరిగే హోరాహోరీ పోరులో విజయం సాధించేది ఎవరు? వారి బలాబలాలు ఏంటి? ఈ ప్రపంచకప్‌లో ప్రస్తుత ప్రపంచకప్‌లో ఏడు లీగ్‌ మ్యాచుల్లో ఆస్ట్రేలియా ఆరింట్లో విజయం సాధించింది. నాలుగు మ్యాచ్‌ల్లో లక్ష్యం ఛేదించింది. రెండు మ్యాచుల్లో తొలి బ్యాటింగ్‌ చేసి గెలిచింది. ఇంగ్లాండ్‌ నిర్దేశించిన 259 పరుగుల లక్ష్యం ఛేదించలేక 3 పరుగులతో ఓడింది. భారత్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా 226/7 పరుగులు చేసింది. లీగ్‌ దశలో 12 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు మిథాలీ సేన టోర్నీని అద్భుత విజయంతో ఆరంభించింది. ప్రారంభ మ్యాచ్‌లో పటిష్ఠ ఇంగ్లాండ్‌ను 35 పరుగుల తేడాతో మట్టికరిపించింది. విండీస్‌పై 7 వికెట్లు, పాక్‌పై 95 పరుగులు, శ్రీలంకపై 16 పరుగుల తేడాతో విజయ ఢంకా మోగించింది. ఐతే తమ కన్నా తక్కువ ర్యాంకు దక్షిణాఫ్రికా చేతిలో 115 పరుగుల తేడాతో భంగపడింది. ఆస్ట్రేలియాతో 8 వికెట్ల తేడాతో సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టం చేసుకొంది. చివరి మ్యాచ్‌లో కివీస్‌ను 186 పరుగుల తేడాతో ఓడించి అంతులేని ఆత్మవిశ్వాసంతో సెమీస్‌లో అడుగుపెట్టింది. అటు.. ఇటు బాగున్నారు! రెండు జట్లలోనూ విలువైన క్రికెటర్లు ఉన్నారు. బలాబలాలను పరిశీలిస్తే ఆసీస్‌ కాస్త మెరుగ్గా ఉంది. ఎల్లీస్‌ పెర్రీ (366), నికోల్‌ బోల్టన్‌ (337), మెగ్‌ లానింగ్‌ (328) ముగ్గురు బ్యాటర్లు టాప్‌-10లో ఉన్నారు. భారత్‌ నుంచి మిథాలీ (356) ఒక్కరే ఉన్నారు. బౌలింగ్‌లో నలుగురు ఆసీస్‌ బౌలర్లు టాప్‌-10లో ఉండగా టీమిండియా నుంచి దీప్తిశర్మ, సుష్మా వర్మ ఉన్నారు. ఆసీస్‌ బలమంతా టాప్‌ ఆర్డరే. బోల్టన్‌, మూనీ, పెర్రీ, లానింగ్‌, మిడిలార్డర్‌లో హైనెస్‌, విలాని, హేలీ బాగా ఆడతారు. భారత్‌లో పూనమ్‌ రౌత్‌, స్మృతి, మిథాలీ, హర్మన్‌, వేద కృష్ణమూర్తి, దీప్తిశర్మ, సుష్మా వర్మ అద్భుతంగా ఆడగలరు. ఆసీస్‌ బౌలింగ్‌కు దీటుగానే భారత్‌ బౌలింగ్‌ బృందం ఉంది. పిచ్‌..టాస్‌ కీలకం ఆసీస్‌తో సెమీస్‌లో పిచ్‌, టాస్‌ కీలకం కానున్నాయి. ఈ మ్యాచ్‌ డెర్బీ కౌంటీ మైదానంలో జరగనుంది. భారత్‌ ఇక్కడ ఆడిన నాలుగు మ్యాచుల్లో ఘన విజయాలు సాధించింది. నాలుగు సార్లూ తొలుత బ్యాటింగ్‌ చేయడం గమనార్హం. డెర్బీలో మిథాలీసేన ఇంగ్లాండ్‌ను 35 పరుగులతో ఓడించింది. పాక్‌ను 95, శ్రీలంకను 16, కీలక మ్యాచ్‌లో కివీస్‌ను 186 పరుగుల తేడాతో మట్టికరిపించింది. అన్ని విజయాల్లోనూ స్పిన్నర్లే కీలకంగా నిలిచారు. ఇంగ్లాండ్‌పై దీప్తిశర్మ (3/47), పాక్‌పై ఏక్తాబిస్త్‌ (5/18), కివీస్‌పై రాజేశ్వరీ గైక్వాడ్‌ (5/15) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. పిచ్‌ పేసర్లకూ అనుకూలిస్తుంది. ఈ మైదానంలో తొలుత బ్యాటింగ్‌ చేసే జట్టు 230 పరుగుల లక్ష్యం నిర్దేశిస్తే ఛేదించే జట్టు తీవ్ర ఒత్తిడికి లోనవుతుంది. పిచ్‌పై బంతి తొలుత అనూహ్యంగా స్వింగై తర్వాత స్పిన్‌కు అనుకూలిస్తోంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్‌ ప్రధాన అస్త్రంగా పనిచేస్తుంది. సెమీస్‌లో ఇలా ఆడితే.. ఆస్ట్రేలియా దుర్భేద్యంగా కనిపిస్తున్నప్పటికీ మిథాలీసేన వారిని ఓడించడం సాధ్యమే. డెర్బీ మైదానంలో భారత్‌ ఆడిన నాలుగు మ్యాచుల్లో గెలవగా ఆసీస్‌ ఇక్కడ ఆడనేలేదు. భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేస్తే స్మృతి మంధాన, పూనమ్‌ రౌత్‌ శుభారంభం అందించాలి. బంతి తొలుత స్వింగ్‌ అవుతుంది కాబట్టి ఆచితూచి ఆడాలి. తొలి పవర్‌ప్లే తర్వాత స్పిన్నర్లు రంగంలోకి దిగుతారు. ఓపెనర్లు మంచి స్కోరు అందిస్తే ఆ తర్వాత సారథి మిథాలీ, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, వేద కృష్ణమూర్తి, దీప్తిశర్మ చెలరేగి ఆడగలరు. తొలి పది ఓవర్లు నిలకడగా ఆ తర్వాత వికెట్లు కాపాడుకుంటూ వేగంగా సింగిల్స్‌ రాబట్టాలి. అందివచ్చిన బంతుల్ని బౌండరీలకు తరలిస్తూ రన్‌రేట్‌ 4.5-5.5 మధ్యన కొనసాగించాలి. వికెట్లు చేతిలో ఉంటే చివరి పది ఓవర్లలో వేగంగా పరుగులు చేస్తే 250 స్కోరు సాధ్యమే. ఇక రెండో ఇన్నింగ్స్‌లో తొలుత టాప్‌ ఆర్డర్‌ వికెట్లు తీస్తే మిగతా పని స్పిన్నర్లు చూసుకోగలరు. ఐతే అవతలి వైపు మూనీ, బోల్టన్‌, హైనెస్‌, పెర్రీ, మెగ్‌ లానింగ్‌ను ఔట్‌ చేయడం అంత సులభం కాదు. భారత బౌలర్లు వైవిధ్యమైన బంతులతో వారిని బోల్తా కొట్టించాలి. పరుగులు ఇవ్వకుండా ఒత్తిడి పెంచితే ఆసీస్‌ను ఓడించడం సాధ్యమే. భారత్‌ కనక రెండో బ్యాటింగ్‌ చేస్తే ఆసీస్‌ను 200 పరుగుల లోపే ఔట్‌ చేయాలి. లేదంటే చాలా కష్టం.


Leave your comment