మరో పే..ద్ద పని పెట్టుకున్న కేసీఆర్

చాలామంది పాలకులు వచ్చారు వెళ్లారు. కానీ.. ఎవరూ చేయని పనుల్ని.. ఎవరూ దృష్టి సారించని అంశాలపైన ఫోకస్ చేయటం చాలా తక్కువ మంది చేస్తుంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు అదే పని చేస్తున్నారు. ఆయన ఆలోచనలు సరికొత్తగా ఉండటమే కాదు.. దశాబ్దాల పాటు పాలకులకు పట్టని అంశాల మీద ఆయన ఆలోచనా తీరు ఆకర్షించేలా ఉంటుంది.

తెలంగాణ రాష్ట్రంలో ఎంతకూ అర్థం కాని బ్రహ్మపదార్థంగా ఉండే అంశాల్లో భూదస్త్రాలుగా చెప్పాలి. ఏ భూమి ఎవరికి.. ఏ పేరిట ఉందన్న విషయాన్ని సూటిగా స్పష్టంగా ఎవరూ చెప్పలేని పరిస్థితి. చివరకు ప్రభుత్వ భూములు సైతం.. తమవేనంటూ పత్రాలు తీసుకొచ్చే వారు ఎందరో. భూములకు సంబంధించిన సమగ్ర సర్వే ఇంత కాలంగా జరగకపోవటం.. పట్టాదారు పాస్ పుస్తకాలు.. పహాణీ పత్రాలు సరళంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోకపోవటంతో భూములకు సంబంధించిన రికార్డులు ఎవరికి అర్థం కాని తీరులో తయారయ్యాయని చెప్పాలి.

అందుకే.. ఈ మొత్తం తీరును ప్రక్షాళన చేసే కార్యక్రమాన్ని కేసీఆర్ షురూ చేశారు. రాష్ట్రంలో గ్రామం యూనిట్ గా సర్వే సెటిల్ మెంట్ కార్యక్రమాన్ని రూపొందించారు. అప్పుడెప్పుడో నిజాం హయాంలో చేసిన భూ బందోబస్తు తప్ప మళ్లీ పత్రాల ప్రక్షాళన జరిగింది లేదు. దీంతో భూవివాదాలు తలెత్తి చాలా సందర్భాల్లో శాంతిభద్రతల సమస్యగా మారుతోంది.

ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు వీలుగా రాష్ట్రంలోని భూమినంతా సర్వే చేయాలని నిర్ణయించారు. ఏ భూమి ఎంత విస్తీర్ణంలో ఉంది.. ఎవరి పేరు మీద ఉందన్న విషయాన్ని తేల్చాలని డిసైడ్ అయ్యారు. భూమికి సంబంధించిన వివరాల్ని సర్వే ఆఫ్ ఇండియాతో పాటు.. దేశంలోని వివిధ సర్వే ఏజెన్సీల సహకారం తీసుకోవాలన్న సూచనను అధికారులకు చేశారు కేసీఆర్.

ఇంతకీ ఈ ప్రక్షాళన కార్యక్రమం ఎందుకు మొదలైందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. వచ్చే ఏడాది నుంచి రైతులకు రెండు పంటలకు కలిపి ఎకరానికి రూ.8వేల పెట్టుబడిగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వ్యవసాయ శాఖ ఒక గ్రామంలో సర్వే నిర్వహించింది. వ్యవసాయ శాఖ వివరాలకు రెవెన్యూ శాఖ వివరాలకు పొంతన కుదరని పరిస్థితి. ఒక గ్రామంలో 300 మంది రైతులు ఉన్నట్లు వ్యవసాయ శాఖ చెబుతుంటే.. కాదు.. రెవెన్యూ రికార్డుల ప్రకారం 1100 మంది ఉన్నట్లుగా తేలటంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.

దీంతో ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి ఎవరికి ఇవ్వాల్సి ఉంటుందన్నది ఒక ప్రశ్న. ఒకవేళ రైతులకు డబ్బు అందకపోతే అదో పెద్ద కుంభకోణంగా మారనుంది. అదే జరిగితే ప్రభుత్వానికి చెడ్డపేరు రావటం ఖాయం. అందుకే..భూ రికార్డుల్ని సరి చేయటంతో పాటు.. రెవెన్యూ.. వ్యవసాయ అధికారుల మధ్య ఉన్న గణాంకాల గ్యాప్ ను భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే..సమగ్ర సర్వేను నిర్వహించాలన్న నిర్ణయానికి సీఎం కేసీఆర్ వచ్చారు.

ఒక రాష్ట్రం మొత్తం సమగ్ర సర్వే అంటే అదో భారీ ప్రయత్నం అవుతుంది. మరింత పని పరిమితంగా ఉన్న రెవెన్యూ ఉద్యోగులతో సాధ్యమేనా? అన్న సందేహం రావొచ్చు. కానీ.. ఎంత పెద్ద పని అయినా ముక్కలు ముక్కలుగా విడగొట్టి పంచాయితీ స్థాయి నుంచి మొదలెడితే.. ఈజీగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయొచ్చు.  అదే విధానాన్ని సీఎం కేసీఆర్ అనుసరించాలని డిసైడ్ అయ్యారు.

రాష్ట్రంలో ఉన్న భూమి పెరగదు.. తరగదు. ఎంత ఉండాలో అంతే ఉంటుంది. అంటే.. ఉన్న భూమికి సంబంధించిన మార్పులు చేర్పులు ఏమీ ఉండవు. ఉండే లొల్లి అంతా.. ఏ భూమి ఎవరిది? ఎవరు దాని యజమానులు అన్నదే తేల్చాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 10850 రెవెన్యూ గ్రామాల్లో సర్వే నిర్వహిస్తారు. ప్రస్తుతం ఉన్న 3500 మంది రెవెన్యూ అధికారులు ఒక్కొక్కరికి మూడేసి గ్రామాలకు ఇన్ ఛార్జిగా నియమిస్తారు. ఒక్కో గ్రామంలో 15 రోజుల్లో గ్రామస్థులు.. గ్రామ రైతుల సంఘం ఆధ్వర్యంలో సర్వే చేస్తారు. ఇందుకోసం అధునిక సాంకేతిక పరికరాల్ని వినియోగిస్తారు. కీలకమైన ప్రాజెక్టు కావటంతో ఈ పని పూర్తి అయ్యే వరకూ రెవెన్యూ అధికారులకు కలెక్టర్లు మరింకే పనేమీ చెప్పరు. ఈ సర్వే చేస్తున్న వేళలోనే.. భూ రికార్డుల తాజా వివరాల్ని ఆన్ లైన్ లో పొందుపర్చటం.. కొత్త పాస్ పుస్తకాలు.. ప్రతి భూమికీ ప్రత్యేక నెంబరును కేటాయించటం.. అవసరమైతే భూములకు హద్దు రాళ్లు పాతటం.. గ్రామ స్థాయిలో ఉన్న రికార్డుల వివరాలే సీసీఎల్ ఏ దగ్గర ఉండటం.. ఎక్కడ ఏ మార్పు జరిగినా ఆన్ లైన్లో అన్ని చోట్లా ఉన్న రికార్డుల్లో మారేలా వ్యవస్థను ఏర్పాటు చేయటం చేయాలన్నది కేసీఆర్ ఆలోచన. ఆయన అనుకున్నది అనుకున్నట్లు జరిగితే.. భూములకు సంబంధించిన చాలా లొల్లి ఒక కొలిక్కి రావటమే కాదు.. భూమాయలు దాదాపు కనుమరుగైపోతాయని చెప్పక తప్పదు. పే..ద్ద పనే అయినప్పటికీ.. దీన్ని అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తి చేస్తే మాత్రం కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోవటం ఖాయం.


Leave your comment