పొన్నం ప్ర‌భాక‌ర్ దీక్ష‌కు కేసిఆర్ స్పాన్స‌రా .. ?

హైద‌రాబాద్ : కొద్ది రోజుల క్రితం పిసిసి ఉపాధ్య‌క్షుడు .. మాజీ ఎంపి పొన్నం ప్ర‌భాక‌ర్ చేసిన ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష మీకు గుర్తుంది క‌దూ. దానిగురించి ఇప్పుడెందుకు ప్ర‌స్తావ‌న అనుకుంటున్నారా .. అక్క‌డికే వ‌స్తున్నాం. క‌రీంన‌గ‌ర్ లో మెడిక‌ల్ కాలేజీ కోసం పొన్నం చేసిన ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌పై పొలిక‌ల్ స‌ర్కిల్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. సిరిసిల్ల జిల్లా నేరెళ్ళ‌లో ద‌ళితుల‌పై పోలీసుల థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించి మ‌రీ కొట్టిన విష‌యం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌లం రేపింది. ఈ ఇష్యూపై రాజ‌కీయ పార్టీలు భ‌గ్గుమ‌న్నాయి. ఈ గ్రామంలో ద‌ళిత యువ‌కుల‌పై పోలీసులు చేసిన దాష్టికం సామాన్య జ‌నాల‌ను సైతం క‌ళ్ళు చెమ‌ర్చేలా చేసింది. నేరెళ్ళ ఘ‌ట‌న‌లో కేసిఆర్ స‌ర్కారు బ‌ద్నాం అయ్యింది. స్వ‌యంగా ముఖ్య‌మంత్రి కొడుకు కేటిఆర్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న సిరిసిల్ల‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న రాజ‌కీయంగా టిఆర్ఎస్ కు కొంత ఇబ్బంది క‌రంగా మారింద‌నే చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారిన నేరెళ్ళ ఘ‌ట‌న నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు కేసిఆర్ పొన్నం దీక్ష‌ను ఉప‌యోగించుకున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

మెడిక‌ల్ కాలేజీ కోసం పొన్నం ప్ర‌భాక‌ర్ చేస్తున్న దీక్ష‌ను హైల‌ట్ చేయ‌డం ద్వారా నేరెళ్ళ ఇష్యూను ప‌క్క‌దారి ప‌ట్టించొచ్చ‌ని గులాబీ బాస్ ఆలోచించాడ‌ట‌. అందుకే ఆ దీక్ష హైల‌ట్ అయ్యేలా లోపాయ‌కారిగా పావులు క‌దిపార‌ని తెలుస్తోంది. పొన్నం దీక్ష‌కు పిసిసి చీఫ్ ఉత్తం ,సిఎల్పీ నేత జానారెడ్డి,జైపాల్ రెడ్డిల లాంటి వారు వెళ్ళి సంఘీభావం తెలిపేలా స్కెచ్ వేశార‌ని స్వ‌యంగా కాంగ్రెస్ వ‌ర్గాలే గుస గుస‌లాడుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌లనం రేపిన నేరెళ్ళ ఇష్యూలో మంత్రి కేటిఆర్ .. ఎంపి వినోద్ లాంటి వారు నేరెళ్ళ‌కు సాఫీగా వెళ్ళి ప‌నిచ‌క్క‌బుట్టుకొచ్చ‌రంటే .. దానికి కాంగ్రెస్ ముఖ్య‌నేత‌ల స‌హ‌కారం ఉంద‌నేది కాంగ్రెస్ లోని కొంద‌రి ఆరోప‌ణ‌. కేటిఆర్ నేరెళ్ళ కు వెళుతుంటే క‌నీసం కాంగ్రెస్ శ్రేణులు నిర‌స‌న కూడా తెల‌ప‌లేదంటే పిసిసి చీఫ్ ఉత్తం అటెన్ష‌నంతా పొన్నం దీక్ష‌పై పెట్ట‌డ‌మే కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. నేరెళ్ళ ఘ‌ట‌న‌పై ముందు హ‌డావిడి చేసిన ఉత్తం ఆ త‌రువాత కుమ్ముక్కు రాజ‌కీయాల‌తో దాన్ని నీరుగార్చార‌ని కాంగ్రెస్ లోని ఓ వ‌ర్గం బ‌లంగా వాదిస్తోంది.

పొన్నం ప్ర‌భాక‌ర్ చేసిన దీక్ష కేవ‌లం ఓ జిల్లాకు సంబంధించిన అంశం. అది కూడా అంత‌గా ప్రాధాన్య‌త లేని మెడిక‌ల్ కాలేజీ కోసం. అక‌రీంన‌గ‌ర్ లో ఇప్ప‌టికే రెండు ప్ర‌యివేట్ మెడిక‌ల్ కాలేజీలు ఉన్నాయి. వాటికే పేషెంట్స్ లేక నానాతంటాలు ప‌డుతున్నారు. ఒక వేళ అక్క‌డ మెడిక‌ల్ కాలేజీ వ‌చ్చినా ఓ యాబై మంది విద్యార్థుల‌కు అడ్మిష‌న్స్ వ‌స్తాయి. అది కూడా అంతా క‌రీంన‌గ‌ర్ జిల్లా వాళ్ళ‌కేనా అంటే అది కాదు. మ‌రి అలాంట‌ప్పుడు ఆ మెడిక‌ల్ కాలేజీ కోసం కాంగ్రెస్ రాష్ట్ర నాయ‌కులు వెళ్ళి పోరాడాల్సిన అవ‌స‌రం ఉందా .. అంటే అది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. తాము అధికారంలో ఉండ‌గా అక్క‌డ మెడిక‌ల్ కాలేజీ గురించి ప‌ట్టించుకోని కాంగ్రెస్ నేత‌లు ఇప్పుడు కేసిఆర్ స్కెచ్ లో భాగంగా క‌రీంన‌గ‌ర్ లో జ‌రిగిన పొన్నం దీక్ష‌ను హైలెట్ చేసి విజ‌య‌వంతంగా నేరెళ్ళ ఇష్యూను ప‌క్క‌దారి ప‌ట్టించార‌ని పొలిటిక‌ల్ స‌ర్కిల్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. అందుకే పొన్నం దీక్ష కేసిఆర్ స్పాన్స‌ర్ అని కాంగ్రెస్ వ‌ర్గాల్లో గుస గుస‌లు వినిపిస్తున్నాయి.


Leave your comment