ఇద్దరూ ఒక్కటై..`రెండాకులు`కాపాడుకున్నారు!

థ్రిల్లర్ సినిమాని తలపించే రేంజ్ లో ఉత్కంఠను రేకెత్తించే సన్నివేశాలు! ఎడతెగని చర్చలు.. కొలిక్కిరాని సమావేశాలు!! ఏం జరుగుతుందోననే ఆసక్తి! ఓపీఎస్ - ఈపీఎస్ వర్గాలు ఒక్కటవుతాయా? లేదా? కలిసిపోతే వారికెన్ని పదవులు.. వీరికెన్ని పదవులు? తమిళ రాజకీయాలు తెలిసిన వారందరిలోనూ కొన్నాళ్లుగా ఇవే ప్రశ్నలు! బీజేపీ అగ్రనేతలు కూడా అమితాసక్తిగా ఎదురు చూస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎంత డ్రామా నడుస్తోందో! తమిళనాట నెలకొన్న నాటకీయ పరిణామాలు ఎప్పటికి ముగుస్తాయని అంతా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు దానికి శుభం కార్డు పడే సమయం వచ్చేసింది.

 

`అమ్మ` మరణంతో తమిళనాడులోని అధికార పార్టీ అన్నాడీఎంకేలో ఏర్పడిన అనిశ్చితికి పూర్తిగా తెరదించే రోజు దగ్గరలో ఉంది. ఇక రేపో మాపో ప్రస్తుత సీఎం పళనిస్వామి - అమ్మ నమ్మిన బంటు - మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వం  వర్గాల మధ్య ఎట్టకేలకు రాజీ కుదిరింది. రెండాకులు కలిసే ఉండబోతున్నాయి. అన్నాడీఎంకే ఐక్యంగా నిలబడుతుందని పార్టీలో ఏ కుటుంబ (శశికళ) జోక్యం ఉండబోదని పన్నీర్ సెల్వం తేల్చిచెప్పారు. అన్నాడీఎంకేలో పళనిస్వామి - పన్నీర్ సెల్వం గ్రూపుల మధ్య రాజీ ఫార్ములా ఖరారైంది. విలీన ప్రక్రియ కొలిక్కివచ్చింది. మాజీ సీఎం పన్నీర్ సెల్వంకు ఉప ముఖ్యమంత్రి - ఆయన అనుయాయులు కొందరికి మంత్రి పదవులు దక్కనున్నాయి.

 

మరోవైపు పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళపై వేటు వేయడంతో పాటు పార్టీ నుంచి బహిష్కరించాలన్న పన్నీర్ వర్గీయుల డిమాండ్ కూ పళనిస్వామి అంగీకరించినట్టు సమాచారం. పార్టీ ఎన్నికలు జరిగే వరకూ స్టీరింగ్ కమిటీకి పన్నీర్ సెల్వం నేతృత్వం వహించేందుకు ఇరు పక్షాల మధ్య అంగీకారం కుదిరింది. కొద్ది కాలం పార్టీకి ఈపీఎస్ - ప్రభుత్వానికి ఓపీఎస్ నాయకత్వం వహించేలా సర్ధుబాటు చేసుకున్నారు. అన్నాడీఎంకేలో ఇరు గ్రూపుల మధ్య ఎలాంటి రాజీ కుదిరినా స్తంభింపచేసిన పార్టీ ఎన్నికల గుర్తును ఎన్నికల కమిషన్ పునరుద్ధరించే అవకాశాలు మెరుగవుతాయి.


Leave your comment