తమిళనాట రాణీ ఆమెనట..

సినిమా పిల్లర్- అందాల భామ కాజల్‌ మరో లక్కీ ఛాన్స్‌ కొట్టేసింది. తాజాగా ‘నేనే రాజు-నేనే మంత్రి’, ‘వివేకం’ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న కాజల్ ‘క్వీన్‌’ రీమేక్‌ లో నటించబోతోంది. 2014 లో హిందీలో విడుదలైన ‘క్వీన్‌’ బాలీవుడ్‌ లో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో కంగనా రనౌత్‌ ‘రాణి’ పాత్రలో నటించి మెప్పించారు. ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేయడానికి చాలా రోజులుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో ‘రాణి’ పాత్రకు తమన్నాను తీసుకుంటున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరిగింది.
ఐతే ఇప్పుడు ఆ పాత్రకు చందమామ కాజల్‌ను ఎంపిక చేసినట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. త్వరలోనే సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభం కాబోతోందట. దర్శక నిర్మాతలు ఈ కథలో కొన్ని మార్పులు చేయాలని ఆలోచిస్తున్నారట. తమిళ ప్రేక్షకులకు దగ్గరగా ‘రాణి’ పాత్రను మార్చడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నెరజాన కాజల్‌ ఆనందం పట్టలేకపోతోంది.
హిందీ మాతృక క్వీన్ నాకు చాలా నచ్చింది. కానీ చాలా ఏళ్ల క్రితం దీన్ని తెరకెక్కించారు. కాబట్టి ఇప్పటి ప్రేక్షకులకు తగ్గట్టు ఆ కథలో మార్పులు చేయాల్సి ఉంది. దక్షిణాధికి సరిపోయేలా ‘క్వీన్‌’లో సొంతంగా మార్పులు చేయాలని నిర్మాతలు, నేను అనుకున్నాం. కథ అలానే ఉంటుంది, కానీ ట్రీట్‌ మెంట్‌ కొత్తగా ఉంటుంది. ఈ పాత్రకు నా నిజజీవిత స్వభావాన్ని కూడా జత చేస్తానని చెప్పుకొచ్చిందీ భామ.


Leave your comment