ఇంద్ర నిర్మాత అశ్వనీదత్‌కు చిరంజీవి విలువైన బహుమతి
ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) విలువైన బహుమతి ఇచ్చారు. 22 సంవత్సరాల క్రితం విడుదలై సంచలనం సృష్టించిన ‘ఇంద్ర’ సినిమా రీ రిలీజ్ (Indra ReRelease) సందర్బంగా ఆ చిత్ర బృందాన్ని చిరంజీవి శుక్రవారం కలిశారు. ఇంద్ర సినిమా నిర్మాత అశ్వనీదత్, డైరెక్టర్ బి.గోపాల్, సంగీత దర్శకుడు మణిశర్మ, సినీ రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావు, చిన్నికృష్ణలను ప్రత్యేకంగా తన నివాసానికి ఆహ్వానించి సత్కరించారు చిరు.
ఈ సందర్బంగా ఇంద్ర నిర్మాత అశ్వనీదత్ కు ఒక అందమైన శంఖాన్ని బహుమతిగా ఇచ్చారు చిరంజీవి. ఈ విషయాన్ని తెలియజేస్తూ అశ్వనీదత్ ట్విట్టర్- ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ఈ విజయశంఖాన్ని కానుకగా మీరు ఇచ్చారు.. కానీ, ఇంద్రుడై, దేవేంద్రుడై దానిని పూరించింది మాత్రం ముమ్మాటికీ మీరే.. ఈ కానుక అమూల్యం.. ఈ జ్ఞాపకం అపురూపం.. అదెప్పటికీ నా గుండెల్లో పదిలం.. అని చెప్పుకొచ్చారు అశ్వనీదత్. ఇక ఇంద్ర చిత్ర బృందాన్ని కలవడంపై చిరంజీవి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇంద్ర సినిమా క్రియేట్ చేసిన సునామీ గుర్తు చేస్తూ 22 సంవత్సరాల తర్వాత మరోసారి థియేటర్లలో రిలీజైన సందర్భంగా చిరు సత్కారం.. సినిమా మేకింగ్ విశేషాలను నెమరు వేసుకోవడం జరిగింది.. అని ట్వీట్ చేశారు.