హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వాల రద్దు సరికాదని హైకోర్టు ఆదేశించింది. క్రమ శిక్షణ పేరుతో ఏకంగా సభ్యత్వాలనే రద్దు చేయడమేమిటని ప్రశ్నించింది. సభ్యత్వాల రద్దు, సర్కారు విడుదల చేసిన గెజిట్, వారి స్థానాల్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌కు సిఫార్సు చేయడం వంటివి ఏవి చెల్లవని తెలిపింది. తక్షణం వారు ఎమ్మెల్యేలుగా గుర్తించబడుతారని వెల్లడించింది. ఇప్పటి వరకూ వారు నష్టపోయిన అన్ని రకాల అలవెన్సులు, భత్యాలను తిరిగి వారికి చెల్లించాలని ఆదేశించింది.
అసలేం జరిగింది..
బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ క్రమశిక్షణ రహితంగా వ్యవహరించి సభలో హెడ్ ఫోన్ విసిరని...అది శాసన మండలి ఛైర్మెన్ స్వామిగౌడ్‌కు తగిలిందనే కారణంతో వారిద్దరి సభ్యత్వాలను రద్దు చేస్తూ మార్చి 14న సర్కారు నిర్ణయం తీసుకుంది. వెంటనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి.. వారి స్థానాల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసింది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయంపై ఇద్దరూ శాసన సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌కుమార్‌లు హైకోర్టును ఆశ్రయించారు. తమ సభ్యత్వాలను సర్కారు అనాలోచితంగా రద్దు చేసిందని హైకోర్టుకు విన్నవించకున్నారు. వారి పిటిషన్ పరిశీలించిన కోర్టు ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. అయితే ప్రభుత్వం తరపు హాజరైన అడ్వకేట్ జనరల్ శాసన సభకు సంబంధించిన పుటేజిని కోర్టుకు సమర్పిస్తానని హామీ ఇచ్చారు. దీనిపై ప్రభుత్వం అప్పట్లో అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మనస్థాపానికి గురైన అడ్వకేట్ జనరల్ తను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
అడ్వకేట్ జనరల్ సభకు పుటేజి ఇస్తానని చెప్పినప్పటికీ తదంతరం ఆయన అందుబాటులో లేకపోవడంతో.. కోర్టు పుటేజి విషయాన్ని ప్రస్తావించింది. పుటేజి సమర్పించాలంటే శాసన సభ తీర్మాణం చేయాలన్న దానిపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. దీంతో అప్పటి నుంచి ఈకేసు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారినట్లైంది. సభలో క్రమశిక్షణ రహితంగా వ్యవహరించారనే కారణంతో వారి సభ్యత్వాలను రద్దు చేయగా.. ఇప్పుడు హైకోర్టు ఇద్దరు ఎమ్మెల్యేలకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో... సర్కారు గొంతులో పచ్చి వెలగకాయ పడినట్లైంది. క్రమ శిక్షణ పేరుతో ఏకంగా సభ్యత్వాలను రద్దు చేయడమేమిటని ప్రశ్నించడంతో.. ప్రభుత్వం ఇరకాటంలో పడినట్టైంది. మరోవైపు ఇద్దరూ ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట రావడంపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఇప్పటికైనా తన విధానాన్ని మార్చుకుంటే మంచిదని పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు.
రాష్ట్రం దృష్టిని ఆకర్షించిన ఈకేసులో ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరపున జంధ్యాల రవిశంకర్ తమ వాదానలు వినిపించారు. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్ అప్పీలుకు వెళ్లుతుందా.. లేదా... అనేది తెలియాల్సి ఉంది.