కాంగ్రెస్ కూటమివైపే తెలంగాణ ప్రజలు

news02 Dec. 5, 2018, 2:09 p.m. political

lagadapati

తన సర్వేలపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు లగడపాటి రాజగోపాల్. ఎవరో వ్యక్తులు తనపై ఒత్తిడి చేస్తే సర్వేలు మార్చే వ్యక్తిని తాను కాదని ఆయన స్పష్టం చేశారు. తనకు పదవుల కన్నా వ్యక్తిత్వం ముఖ్యమని... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా కూటమిదే పైచేయిగా ఉందని చెప్పారు. తన నిస్పక్షపాతమైన సర్వేలపై కేటీఆర్‌ విమర్శలు గుప్పించారని లగడపాటి మండిపడ్డారు. సర్వే పేరుతో తెలంగాణ ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఆరోపించడాన్ని తీవ్ర స్థాయిలో ఆక్షేపించారు. సెప్టెంబర్‌ 15న కేటీఆర్‌ తన సమీప బంధువుల ఇంట్లో కలిశానని లగడపాటి తెలిపారు. ఆ సమయంలో ఎన్నికల విషయంలో కేటీఆర్ తన సాయం కోరారని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలను మార్చకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందులు తప్పవని తనకున్న రాజకీయ అనుభవంతోకేటీఆర్ కు సూచించానని లగడపాటి తెలిపారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీల నేతలను అరెస్టులు చేయించడం మంచిది కాదని కూడా కేటీఆర్ కు చెప్పానని గుర్తు చేశారు. తెలంగాణలో ఏపీ సీఎం చంద్రబాబును.. టీడీపీ పార్టీని కలపుకొని వెళితే మంచిదని కేటీఆర్ కు సూచించినట్లు చెప్పుకొచ్చారు. 

lagadapati

ఇక నవంబర్‌ 11 తేదీ నాటికి తెలంగాణలో మొత్తం 37 మంది అభ్యర్థుల విషయంలో సర్వే చేయగా.. కాంగ్రెస్‌ పార్టీకి ఆధిక్యం వస్తుందని కేటీఆర్‌కు మెసేజ్‌ పెట్టానని లగడపాటి చెప్పారు. ఎన్నికల్లో పోటా పోటీగా ఉన్నప్పుడు అభ్యర్థులే కీలకం అవుతారని చెప్పానని... మళ్లీ నవంబర్‌ 20న కేటీఆర్ కు రెండోసారి  మెసేజ్‌ పెట్టానని గుర్తు చేశారు. అప్పటికీ కూటమి సీట్ల సర్దుబాటు విషయంలో గందరగోళం చూసి టీఆర్ ఎస్ కు 65 నుంచి 70 సీట్ల వరకు వస్తాయని చెప్పినట్లు తెలిపారు. తన సర్వేపై స్పందించిన కేటీఆర్.. ఇంత కంటే ఎక్కువే వస్తాయని రిప్లై ఇచ్చారని లగడపాటి చెప్పారు. ఐతే ఆ తర్వాత తెలంగాణ ప్రజల ఆలోచన వేగంగా మారిందన్న ఆయన.. దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, ఇంటింటికి నల్లా, ఉద్యోగాల భర్తీ తదితర హామీల విషయంలో ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని చెప్పారు. కూటమి ఏర్పాటు కాకముందు టీడీపీకి ఉన్న 20 శాతం ఓట్లు టీఆర్ ఎస్ కు డైవర్ట్ అయ్యాయన్న లగడపాటి రాజగోపాల్.. కూటమి ఏర్పాటు తర్వాత ఆ ఓట్లు తిరిగి ప్రజాకూటమికి డైవర్ట్ అయ్యాయని స్పష్టం చేశారు. చివరగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిదే పైచేయి అన్న లగడపాటి.. ప్రజలు ప్రజా కూటమికే అధికారం కట్టబెడతారని స్పష్టం చేశారు.

tags: lagadapati rajagopal. lagadapati fire on ktr, lagadapati fire on kcr, lagadapati rajagopal fire on ktr, lagadapati rajagopal survey report, lagadapati telangana survey report

Related Post