రైతులను కేసీఆర్ మోసం చేశారు

news02 Dec. 5, 2018, 10:36 p.m. political

rahul

రైతులు దేశానికి వెన్నెముక లాంటివారని ఏఐసిసి అధ్యక్షులు రాహుల్‌గాంధీ అన్నారు. హోటల్ తాజ్ కృష్ణాలో ఏర్పాటు చేసిన మహాకూటమి  మీడియా సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు, పీసిసి చీఫ్ ఉత్తమ్, గద్దర్, కుంతియా, సూరవరం సుధాకర్ రెడ్డి తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు.  రైతులను ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ మోసం చేశారని ఈ సందర్బంగా రాహూల్ విమర్శించారు. సీఎం అభ్యర్థి ఎవరన్నది ఇప్పుడే చెప్పలేమని రాహూల్ అన్నారు. ముందు కేసీఆర్‌ ను గద్దె దించడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని రాహుల్ చెప్పారు. మహాకూటమికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పలేమన్న ఆయన.. కాని గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు ఇప్పుడు ఓటమి భయం పట్టుకుందని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. నాలుగున్నరేళ్ల కేసీఆర్‌ పాలన అవినీతిమయంగా మారిందని రాహూల్ మండిపడ్డారు. 

rahul

యువకులు, తెలంగాణ ప్రజలు తాము కన్న కలల్ని మర్చిపోయారని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను కేసీఆర్ తుంగలో తొక్కారని రాహూల్ విమర్శించారు. ఇక టీఆర్‌ఎస్‌-బీజేపీ కూటమిని ఓడించాలని ప్రజా గాయకుడు గద్దర్‌ పిలుపునిచ్చారు. నాలుగు కోట్ల ప్రజల ఫ్రంటే ప్రజాఫ్రంట్‌ అని ఆయన చెప్పారు. ప్రజాఫ్రంట్‌ ని గెలిపించి త్యాగాల తెలంగాణ నిర్మించాలని ప్రజలకు గద్దర్ విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ నియంతృత్వ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని చెప్పిన మందకృష్ణ మాదిగ.. ఎస్సీ వర్గీకరణపై ప్రశ్నిస్తే మమ్మల్ని జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని అర్ధరాత్రి అరెస్ట్ చేశారని మండిపడ్డ మంద కృష్ణ.. కేసీఆర్ ఒక్కడి వల్ల తెలంగాణ రాలేదని చెప్పారు. కృష్ణా జలాలపై కేసీఆర్‌‌ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కృష్ణా నదిపై ప్రాజెక్టులన్నీ మొదలుపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనేనని చంద్రబాబు గుర్తు చేశారు. అంతా చేసిన తనపైనే ఇప్పుడు కేసీఆర్ ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. 

rahul

తాను ప్రాజెక్టులకు అడ్డుపడ్డట్లు ఆధారాలు చూపగలరా అని కేసీఆర్ ను ఏపీ సీఎం చంద్రబాబు సూటి ప్రశ్నించారు. కాళేశ్వరం తప్ప మిగతా ప్రాజెక్టులన్నీ మేం ప్రారంభించినవేనని ఆయన స్పష్టం చేశారు. ఐతే ఆ తరువాత ఆ ప్రాజెక్టులనే కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగించిందని చంద్రబాబు చెప్పారు. మేం చేసిన అభివృద్ధిని కేసీఆర్‌ నిర్వీర్యం చేశారని బాబు మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి కోసమే ప్రజా కూటమి ఏర్పాటు చేశామని చంద్రబాబు చెప్పారు. ఇక ప్రజా కూటమి మేనిఫెస్టో అమలు చేసేది కోదండరామ్‌ కమిటీనే అని చంద్రబాబు తేల్చిచెప్పారు. ప్రజాకూటమిని గెలిపిస్తేనే తెలంగాణకు మంచి భవిష్యత్తు ఉంటుందన్న చంద్రబాబు.. ఎన్నికలలో అందరూ తప్పకుండా ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు.

tags: rahul, rahul gandhi pc, rahul gandhi press conference, rahul chandra babu press conference, prajakutami press conference, rahul gandhi pc in taj krishna, rahul chandra babu fire on kcr

Related Post