మంచిర్యాల: ఎగిరేగిరి పడుతున్నమ్మ ఎన్నటికైనా కిందపడక తప్పదంటారు పెద్దలు. అధికారం చేతిలో ఉంది కదా అని రెచ్చిపోతే ఎదురు దెబ్బలు తగలడం ఖాయమంటారు. అందుకేనేమో ఇప్పటి వరకు చాలా మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బెదిరింపులకు పాల్పడి అడ్డంగా బుక్కయ్యారు. తన, మన అనే భేదం లేకుండా అధికారులు, సొంత పార్టీ నేతలపైనే చిందులేసి దొరికిపోయారు. ఇక తాజాగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య విషయంలోనూ ఇదే జరిగింది. తనకు అనుకూలంగా ఉండే బెల్లంపల్లి మున్నిపల్ ఛైర్మెన్‌ను కాపాడుకుందుకు ఆయన చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడడమే కాకుండా...ఓ కౌన్సిలర్ కూతురుకు సాఫ్ట్‌గా వార్నింగ్ ఇచ్చి బొక్కబోర్ల పడిపోయారు.
ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో...ఎమ్మెల్యే పరువంతా పోయినట్లైంది. ఛైర్మెన్ పదవిని నిలబెట్టుకోవాలనుకున్న టీఆర్ఎస్ నాయకత్వానికీ ఎదురు దెబ్బె తగిలింది. ఇందుకు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యవహరించిన తీరే కారణం. తన గ్రూప్‌కు సంబంధించిన మున్సిపల్ ఛైర్మెన్‌ను కాపాడుకునేందుకు ఆయన బెదిరింపుల పర్వానికి తెర తీశారు. ఛైర్ పర్సన్ సుధారాణికి మద్దతిస్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య...అసమ్మతి నేతలతో వ్యవహరించిన తీరు సరిగా లేకనే వారు ఆయనతో విభేదించి రహస్య శిబిరానికి తరలి వెళ్లి క్యాంపులు నిర్వహిస్తున్నారు. దీంతో ఇప్పుడు బెల్లంపల్లి మున్పిపల్ ఛైర్మెన్ పదవిపై నీలి నీడలు కమ్ముకొన్నాయి.
ప్రస్తుతం బెల్లంపల్లి మున్సిపాలిటీ పాలకమండలిలో మొత్తం 34 మంది సభ్యులున్నారు. అయితే వీరిలో గత ఎన్నికల్లో 10 మంది కౌన్సిలర్లు మాత్రమే అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి 12 సభ్యులు విజయం సాధించగా...టీడీపీ,సీపీఐ, స్వతంత్రులు కలిసి మరికొన్ని సీట్లు గెలుపొందారు. దీంతో ఎవరికీ మున్సిపాల్ చైర్మెన్‌ను ఎన్నుకునేందుకు మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో...టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండిపెండెంట్లు మరి కొంత మంది ఇతర పార్టీల సభ్యులను కలుపుకొని అధికార ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు అనుకూలంగా ఉన్న పసుల సునీతారాణిని మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా ఎన్నుకున్నారు.
అయితే పాలక మండలి కొలువుదీరి 4 ఏళ్లు కావొస్తున్న...ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కానీ, చైర్మెన్ సునీతారాణిగాని తన ఎన్నికకు మద్దతునిచ్చిన కౌన్సిల్ సభ్యులను పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. దీనికి తోడూ ఏ పనినైనా ఆమె ఎమ్మెల్యే దుర్గం అనుమతిస్తేనే ముందుకు వెళ్లుతుండడంతో...అసమ్మతి సెగ రాజుకుంది. మున్సిపల్ పరిధిలో జరిగిన ప్రతి పనికి ఆయకే ప్రాధ్యానం ఇవ్వడంతో...కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల నుంచి గెలుపొందిన కౌన్సిలర్లలు నొచ్చుకున్నారు. ఈనేపథ్యంలోనే గురువారం 29 మంది కౌన్సిల్ సభ్యులు ఛైర్ పర్సన్‌పై తిరుగబావుటా జెండా ఎగురవేయడం విశేషం. అయితే మొత్తం 34 మంది సభ్యులుంటే...అందులో 29 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతిస్తూ లేఖపై సంతకాలు చేసి జిల్లా జాయింట్ కలెక్టర్‌కు అందజేశారు.
అయితే ఎక్కువ మంది సభ్యులు అవిశ్వానికి మద్దతు తెలుపడంతో...అధికార టీఆర్ఎస్ పార్టీకి గుండెళ్లో రైలు పరిగెత్తినట్లైంది. దీంతో రంగంలోకి దిగిన స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తన అనుచరురాలు సునీతా రాణిని కాపాడుకునేందుకు బెదిరింపుల పర్వానికి తెర లేపారు. ఏలాగైనా అసంతృప్తులను దారిలోకి తెచ్చుకునేందుకు...వారి కుటుంబ సభ్యులకు ఫొన్ చేసి త్రెటెన్ చేసి అడ్డంగా దొరికిపోయారు. అయితే ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బెదిరింపు కాల్స్ కాస్తా...సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీఆర్ఎస్ పార్టీకి నాలుకు కర్చుకున్నంత పనైంది. దీంతో ఆడలేక మద్దెల ఓడే అన్నట్లు అవిశ్వాసం నెగ్గెదెలా అని తలలు పట్టుకోవడంతో పాటు...ఇప్పటికే గతంలో తమ పార్టీ ఎమ్మెల్యేల బెదిరింపు కాల్స్ విషయాన్ని తలచుకొని గులాబీ అధినాయకత్వం తెగ బాధపడుతోందట. అందుకే అవిశ్వాసంలో నెగ్గడం సంగతెమో కానీ, తమ ఎమ్మెల్యేలు చేస్తున్న పిల్ల చేష్టలతో పార్టీ పరువు పోతోందని మదనపడుతోందట..!