ఉద్యోగాల క‌ల్ప‌నే మా ప్ర‌ధాన ఎజెండా ..!

news02 May 17, 2018, 12:36 p.m. political

uttam kumar reddy

ఆసిఫాబాద్ : నిరాశ, నిస్పృహతో కొట్టుమిట్టాడుతున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే ప్రధానాంశంగా కాంగ్రెస్‌ ఎజెండా ఉంటుందని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ శాశ్వత ప్రాతిపదకపై భర్తీ చేస్తామని యువతకు ఆయ‌న భరోసా ఇచ్చారు. ప్రజా చైతన్య బస్సు యాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం ఆసిఫాబాద్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ పాలన ప్రజలకు శాపంగా మారిందని దుయ్యబట్టారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్‌ మోసం చేశారని ఉత్తమ్ విమర్శించారు. గిరిజనులపై సీఎం కు చిత్తశుద్ధి ఉంటే ఒక్కో కుటుంబానికి  మూడు ఎకరాల భూమి ఇవ్వా లని ఆయ‌న డిమాండ్‌ చేశారు. 

uttam kumar reddy

జల్‌, జంగల్‌, జమీన్‌ నినాదంతో గిరిజనుల విముక్తి కోసం అలుపెరగని పోరాటం చేసిన కుమరం భీం స్ఫూర్తితో అధికార టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా గిరిజనులు సమాయత్తం కావాలని ఆయ‌న పిలుపునిచ్చారు. ఇప్పటి వరకూ తాను తిరిగిన 36 నియోజకవర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని, వచ్చే ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం రానుందనడానికి ఇదే సంకేతమని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 80 సీట్లు గెలిచి కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం తథ్యమని ఉత్త‌మ్ ధీమా వ్య‌క్తం చేశారు. ప్రభుత్వ నిర్వాకం కారణంగా గిరిజనులకు పది శాతం రిజర్వేషన్‌ అమలు కావడం లేదని, బిల్లు ఢిల్లీకి పంపామంటూ ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోందని ధ్వజమెత్తారు. బిల్లు ఢిల్లీకే పోయిందో.. గల్లీకే పోయిందో ఎవరికీ అంతు చిక్కడం లేదని ఉత్త‌మ్ వ్యాఖ్యానించారు. 

uttam kumar reddy

నాలుగేళ్లలో ఏ ఒక్క గిరిజనుడికైనా ఎకరం భూమి ఇచ్చారా .. అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు పీసీసీ కెప్టెన్ ఉత్త‌మ్. రైతాంగానికి ఇవ్వాల్సింది పెట్టుబడి సాయం కాదని.. మద్దుతు ధర అని ఆయ‌న వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ హయాంలో 7 వేలుగా ఉన్న క్వింటాల్‌ పత్తి ధర.. 4,500 వద్దకు ఎందుకు దిగజారిందో రైతులు గమనించాలని సూచించారు.  మద్దతు ధర అడిగిన పాపానికి ఖమ్మంలో రైతులకు బేడీలు వేశారని, భూపాలపల్లిలో పోడు భూము లు చేసుకుంటున్న గిరిజనుల్ని చెట్టు కట్టేసి కొట్టారన్నారు. ఎస్సీ, ఎస్టీల కోసం కేటాయించిన నిధుల్లో పది వేల కోట్ల రూపాయలు దారి మళ్లించినట్టు కాగ్‌ ఆక్షేపించిందని గుర్తుచేశారు. 

uttam kumar reddy

ఎన్నికల హామీల్లో ఒక్క దానిని కూడా నెరవేర్చలేదని, పైగా గిరిజనుల భూములు లాక్కుంటోం దని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే గిరిజనులకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయిస్తామని ఉత్తమ్‌ హామీ ఇచ్చారు. సీనియర్‌ నేత హనుమంతరావు మాట్లాడుతూ కేసీఆర్‌ తన కొడుకును ముఖ్యమంత్రి చేసుకునే పథకంలో భాగంగానే ఫెడరల్‌ ఫ్రంట్‌ను తెరపైకి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. గవర్నర్‌ ప్రభుత్వ భజనలో మునిగి తేలుతున్నారని ఆయ‌న విమర్శించారు. 

Related Post