తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారు: ఉత్తమ్

news02 March 14, 2018, 4:35 p.m. political

స్పీకర్ రాజ్యాంగ పదవికి మచ్చ తెచ్చేలాగ వ్యవహరించారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సస్పెండ్ చేయడం దేశంలో ఎక్కడ జరగలేదని ఆయన విమర్శించారు.  చైర్మన్ కు గాయం అయితే వీడియో ఫుటేజ్ ను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. స్పీకర్ తనకు లేని అధికారాలు ఉపయోగిస్తున్నారని ఉత్తమ్ అన్నారు. గాంధీభవన్ లో కాంగ్రెస్‌ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు హాజరైన ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ అవమానపరుస్తున్నారని.. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కేసీఆర్ తన తీరు మార్చుకోవాలన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆందోళనలను అడ్డుకుని కార్యకర్తలను పోలీసులు అరెస్టులు చేయడాన్ని ఉత్తమ్ తీవ్రంగా ఖండించారు. పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోవాలని సూచించారు. కేసీఆర్ పాలనలో పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామన్న ఉత్తమ్ అభ్యర్థుల వేటు, సస్పెన్షన్ అంశంపై రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

మరోవైపు తమపై వేటు పడిన నేపథ్యంలో  కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ లు ఆన్ లైన్ లో సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చేశారు. అప్రజాస్వామికంగా తమపై వేటు వేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సభలో సహజ సూత్రాలకు విరుద్ధంగా స్పీకర్ వ్యవహరించారని ఫిర్యాదులో తెలిపారు.

tags: uttam kumar reddy, pcc, congress, gandhibhavan, assembly

Related Post