తెలంగాణలో మార్పు అనే తుఫాను వచ్చేస్తోంది

news02 Dec. 5, 2018, 10:06 p.m. political

rahul

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక యువతలో నైరాశ్యం నెలకొందని.. కానీ కేసీఆర్ కుటుంబానికి మాత్రం సంపద సమకూరిందని ఏఐసిసి అధ్యక్షులు రాహూల్ గాంధీ అన్నారు. కోదాడలో ఏపీ సీఎం చంద్రబాబు, పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి ఆయన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మహిళలు, యువకులు తమ రక్తాన్ని ధారపోసి రాష్ట్రాన్ని సాధించుకున్నారని ఈ సందర్బంగా రాహూల్ చెప్పారు. ఈ మధ్య నల్గొండ వచ్చిన సీఎం కేసీఆర్ నల్గొండను దత్తత తీసుకుంటానని చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ ఎక్కడికి వెళ్తే అక్కడి ప్రాంతాన్ని దత్తత తీసుకుంటారని చెప్పిన రాహూల్.. కానీ అక్కడ అభివృద్ది మాత్రం చేయరని ఎద్దేవా చేశారు. తెలంగాణలో రైతులు, అమర వీరుల కుటుంబాలను, నిరాశలో ఉన్న యువతను కేసీఆర్ దత్తత తీసుకోవాలని రాహూల్ సూచించారు. గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో సీఎం కేసీఅర్ తనయుడు కేటీఆర్ ఆదాయం నాలుగు వందల శాతం ఎలా పెరిగిందని ఆయన ప్రశ్నించారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను నాలుగున్నరేళ్ల కాలంలో కేసీఆర్ రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేశారని రాహూల్ మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం మినరల్ వాటర్ తాగితే.. నల్గొండ ప్రజలు మాత్రం ఫ్లోరైడ్ నీళ్లు తాగాలా అని రాహూల్ నిలదీశారు. 

rahul

తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 33లక్షల మంది నిరుధ్యోగులు ఉన్నారని రాహూల్ గాంధీ చెప్పారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన కేసీఆర్ తన కుటుంబం వరకే ఉద్యోగాలను తెచ్చుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని రాహూల్ హామీ ఇచ్చారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పేరును కాళేశ్వరంగా మార్చి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వ్యయాన్ని 10వేల కోట్ల నుంచి 60 వేల కోట్లకు పెంచారని రాహుల్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ నాలుగున్నరేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా 4వేలకు పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని రాహూల్ ఆవేధన వ్యక్తం చేశారు. తెలంగాణను ఒక్క కుటుంబం మాత్రమే పరిపాలించడాన్ని సహించబోమని చెప్పిన రాహూల్.. ఇక పై తెలంగాణ ప్రజలే పాలించుకునేలా చేస్తామన్నారు. కొన్ని రోజుల్లో తెలంగాణలో మార్పు అనే తుపాను రానుందని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ఇక అధికారంలోకి రాగానే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును పునర్‌ నిర్మిస్తామని, అందరికీ సాగు, తాగునీరు అందిస్తామని రాహూల్ హామీ ఇచ్చారు. తెలంగాణ రైతులంతా కేసీఆర్‌ను గద్దె దించాలనే కృత నిశ్చయంతో ఉన్నారన్న రాహూల్ గాంధీ.. ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తొలి ప్రాధాన్యంగా రైతుల రుణాలను మాఫీ చేస్తామన్నారు.
 

tags: rahul, rahul gandhi, rahul in kodada, rahul fire on cm in kodada, rahul kodada meeting, rahul gandhi meeting in kodada, rahul kodada election campaign

Related Post