కేసీఆర్ స‌ర్కారుపై ఉత్త‌మ్ నిప్పులు ..!

news02 April 16, 2018, 11:44 a.m. political

uttam

డోర్నకల్ : రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వస్తోందని పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో  రానున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలంగాణ ప్రజలు కచ్చితంగా కాంగ్రెస్ గెలిపిస్తారన్నారు. ప్రజా చైతన్య బస్సుయాత్ర ఆదివారం మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ నియోజవర్గంలోని మరిపెడకు చేరుకున్న సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సెంట్‌మెంట్‌ను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ .. నాలుగేళ్లలో ప్రజలకు ఇచ్చిన ఏ హామీనీ నెరవేర్చలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లకు వంకలు పెట్టి .. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామన్న ప్రగల్బాలు ఏమయ్యాయని ఉత్త‌మ్ ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం, దళిత, గిరిజనులకు మూడెకరాల భూమి అంటూ ఆశలు కల్పించి, నిరుద్యోగులను, అమాయక ప్రజలను మోసం చేశారని అన్నారు. మిర్చి పంటకు సరైన ధర ఇవ్వాలని అడిగిన పాపానికి ఖమ్మంలో రైతులకు బేడీలు వేసి, దేశద్రోహం కేసు పెట్టి జైలుకు పంపించారని ఆయ‌న మండిపడ్డారు. ఇలాంటి పార్టీని వచ్చే ఎన్నికల్లో ప్రజలు మట్టికరిపించాలని ఉత్తమ్‌ పిలుపునిచ్చారు. 

congress meeting

రైతులకు రుణమాఫీ ఏకాలంలో చేయాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మొరపెట్టుకుంటే నాలుగు దఫాలుగా చేశారని, వడ్డీభారం పెరిగిందని నిలదీస్తే.. దానిని తామే భరిస్తామని మాట ఇచ్చిన కేసీఆర్ .. ఆ మాటను కూడా తప్పి .. ప్రజలను మోసం చేశారని ఉత్త‌మ్ ఆరోపించారు. అనేక హామీలను విస్మరించిన సీఎం కేసీఆర్‌కు వచ్చే ఎన్నికల్లో సరైన రీతిలో బుద్ధి చెప్పాలన్నారు. తమ బస్సుయాత్ర 27 నియోజకవర్గాల్లో పూర్తయిందని, ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ కు ఘనస్వాగతం లభిస్తోందని తెలిపారు. ఇక త‌న ప్ర‌సంగంలో ఉత్త‌మ్ పార్టీ పిరాయింపు దార్ల‌పై విరుచుకుప‌డ్డారు. అధికార దాహంతో డబ్బుకు కక్కుర్తి ప‌డి పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు పార్టీ పిరాయించడమంటే తమను ఎన్నుకున్న ఓటర్లను నిండా మోసం చేయడమేనన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ టిక్కెట్‌పై పోటీ చేసి ప్రజల తీర్పుతో ఎమ్మెల్యే అయిన రెడ్యా నాయక్‌ అధికార టీఆర్ఎస్‌ తీర్థం తీసుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. రెడ్యానాయక్ కు కాంగ్రెస్ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని, అలాంటి కాంగ్రెస్‌ పార్టీనే కాకుండా ఓట్లు వేసి గెలిపించిన ఓటరు దేవుళ్లను కూడా రెడ్యానాయ‌క్ మోసం చేశారని ఉత్త‌మ్ నిప్పులు చెరిగారు.

congress meeting ai dornakal

డోర్నకల్‌లో జరిగిన ప్రజా చైతన్య బస్‌ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టడం పట్ల ఉత్తమ్‌ తన సంతోషాన్ని వెలిబుచ్చారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి 2014 వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ డోర్నాక‌ల్ లో కాంగ్రెస్‌ పార్టీయే నిరాటంకంగా విజయం సాధిస్తూనే ఉందని, వచ్చే ఎన్నికల్లో కూడా కచ్చితంగా మళ్లీ కాంగ్రెస్‌ పార్టీయే గెలుస్తుందనే ఆయ‌న ధీమా వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్‌గా కూడా రెడ్యానాయక్‌ కాంగ్రెస్‌ పార్టీ వల్లే గెలిచారని, ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన తల్లి లాంటి కాంగ్రెస్‌ పార్టీని రెడ్యానాయక్‌ వీడిపోవడం తల్లి పాలు తాగి రొమ్ముపై గుద్దడమే అవుతుందని ఉత్తమ్‌ తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రెడ్యానాయ‌క్  చరిత్ర హీనుడిగా నిలిచిపోతున్నారన్న ఉత్త‌మ్ .. డ్ర‌గ్స్, ఇసుక మాఫియాలలో రెడ్యా నాయక్ మునిగితేలుతున్నార‌ని ఆరోపించారు. గిరిజనులకు రిజర్వేషన్లు 12 శాతానికి పెంచుతామని, పేదలందరికీ రెండు పడక గదుల ఇండ్లను నిర్మిస్తామని, దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామంటూ టీఆర్ఎస్‌ ఇచ్చిన ఏ హామీ కూడా అమలు చేయలేదని ఉత్తమ్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై టీఆర్ఎస్‌ ప్రభుత్వం  వేధింపులపై ఉత్తమ్‌ తీవ్రంగా స్పందించారు . ఇలాంటి చ‌ర్య‌లు మానుకోకుంటే .. తమ పార్టీ అధికారంలోకి రాగానే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనాల్సివస్తుందని ఉత్తమ్ హెచ్చ‌రించారు. కాంగ్రెస్‌ శ్రేణులెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని, ఓటు బ్యాలెట్ తో టీఆర్ఎస్‌ను గద్దె దించాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా టీపీసీసీ నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్రలో ఇప్పటివరకు 27 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటన పూర్తి చేసుకుంది. అన్ని చోట్లా బస్సు యాత్రకు అనూహ్య స్పందన లభిస్తుండ‌టం పార్టీ శ‌రేణుల‌కు కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. 

congress bus yathra

ఇక త‌న ప్ర‌సంగంలో అధికార పార్టీని టార్గెట్ చేస్తూనే మ‌రో వైపు రైతుల‌కు .. నిరుద్యోగుల‌పై వ‌రాల జ‌ల్లు కురిపించారు ఉత్త‌మ్.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఒకే విడతలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. 17 రకాల పంటలకు మద్దతు ధర లభించేలా సమగ్ర ప్రణాళికను రూపొందిస్తామన్న ఉత్త‌మ్ .. పంటలకు బీమా సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో టీఆర్ఎస్‌ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని, ప్రభుత్వంలో రెండు లక్షలకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వారిని భర్తీ చే యకుండా టీఆర్ఎస్‌ మీనమేషాలు లెక్కిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయానికి లక్షా 70 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే అందులో ఏడు వేల పోస్టులను కూడా ప్రభుత్వం భర్తీ చేయలేదని, తెలంగాణ వస్తే ఎంతో మేలు జరుగుతుందని ఆశపడిన వారినీ కేసీఆర్‌ సర్కార్‌ మోసం చేసిందని ఉత్తమ్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారపగ్గాలు అందుకోగానే లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని, నిరుద్యోగులకు ప్రతి నెలా మూడు వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని, మహిళలు ఆర్థికసంవృద్ధి కోసం చర్యలు తీసుకుంటామని ఉత్తమ్‌ హామీ ఇచ్చారు.

congress bus yatra at dornakal

tags: Congress Bus Yathra ,Uttam Kumarreddy,Redyanayak,KCR,TRS,GANDHUBHAVAN,Congress

Related Post