హైదరాబాద్: ఆయన ఒక్కప్పుడు బ్యాంకు మేనేజర్‌గా పని చేశారు. అనేక మందికి బ్యాంకు రుణాలను అందించారు. అయినప్పటికీ ఆయనకు సంతృప్తి లేకపోవడంతో... రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేసి.. ప్రస్తుతం టీఆర్ ఎస్ సర్కారులో మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే బ్యాంకులో పనిచేసిన అనుభవమో...! ఏమో..తెలియదు కానీ, ఇప్పుడు ఆయన కుమారులు ఎస్బీఐ బ్యాంకుకు శఠగోపం పెట్టిన వైనం హాట్ టాపిక్‌గా మారింది.
పంచాయితీ రాజ్&గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇద్దరు కుమారులు జూపల్లి అరుణ్, జూపల్లి వరుణ్ ఎస్బీఐ బ్యాంకుకు 86 కోట్ల రుణం ఎగ్గొట్టిన అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. కంపెనీ పేరుతో తీసుకున్న లోన్ కట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. విజయ్ మాల్యా, లలిత్ మోదీ, నీరవ్ మోదీల కంపెనీ పేరుతో బ్యాంకును ముంచారని విమర్శలు గుప్పుమంటున్నాయి.

మంత్రి జూపల్లి కృష్ణారావు ఇద్దరు కుమారులు జూపల్లి అరుణ్, జూపల్లి వరుణ్.శైలిపారాడైమ్ ఇన్ఫ్రా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పెట్టారు. వీరికి వాసిరెడ్డి కిరణ్ రెడ్డి అనే మరోవ్యక్తి తోడయ్యాడు. తెలంగాణలో కట్టే నీటిపారుదల, రోడ్ ప్రాజక్టులకు సేవలందించేందుకు ఈ కంపెనిని పెట్టారు. తమకున్నకిస్మత్ పూర్ లోని 4ఎకరాలు, రాజేంద్ర నగర్ లోని గగన్ పహాడ్ ఏరియాలో 3ఎకరాలు, అమీర్ పేట్ లోని రాయల్ పెవిలయన్ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో 3 ఫ్లాట్స్ చూపించి 60కోట్ల లోన్ తీసుకున్నారు. 2013లో లోన్ తీసుకున్నారు. అది 2017 డిసెంబర్ నాటికి 86 కోట్లకు చేరుకుంది. అయితే 2014లో క్రిద్యా ఇన్ ఫ్రా లిమిటెడ్ అనే అన్ లిస్టెడ్ కంపెనికి తమకు సంబంధించిన కంపెనీని అమ్మేశారు. దీంతో బ్యాంకు అధికారులు ఇప్పుడు ఏమి చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. తాకట్టు పెట్టిన భూముల్లో సైతం వివాదాలు ముసురుకోవడం.. భూములు ఏలాగైనా అమ్ముదామనుకున్నా.. మంత్రి జూపల్లి కుమారులు కావడంతో ఎవరూ ముందుకు రాకపోవడంతో.. బ్యాంకు అధికారులు ఏం చేయాలనేదనిపై సతమతమవుతున్నట్లు సమాచారం.