గులాబీ బాస్‌కు లంబా(దా)డీల‌ ద‌డ‌

news02 July 7, 2018, 4:19 p.m. political

banjaras

హైద‌రాబాద్: గులాబీ బాస్‌కు లంబాడీల‌తో కొత్త త‌ల‌నొప్పి త‌యారైందా..? టీఆర్ఎస్‌పై లంబాడీలు తిరుగు బావుటా ఎగుర‌వేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారా...? ఇటీవ‌ల లంబాడీల వ‌రుస‌ స‌భ‌లు, స‌మావేశాలు, ప్లీన‌రీ మీటింగ్‌ల‌తో గులాబీ ద‌ళ‌ప‌తికి గుబులు ప‌ట్టుకుందా..? అవును...ప‌రిస్థితులు చూస్తుంటే..కేసీఆర్‌కు ఝ‌ల‌క్ ఇచ్చేందుకు లంబాడీలు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లే తెలుస్తోంది. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో...కారు స్టీరింగ్ పికేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్న‌ట్లు స‌మాచారం. అందుకే తెలంగాణలోని ఎస్టీ రిజ‌ర్వుడు స్థానాల‌తో పాటు దాదాపు మ‌రో 30 సెగ్మెంట్ల‌లో కారు జోరును బేజారు చేయ‌డ‌మే టార్గెట్‌గా లంబాడీలు ముందుకు క‌దులుతున్నారు. 

kcr

గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్‌పై లంబాడీల ముప్పెట దాడి రోజు రోజుకు పెరుగుతోంది. ఆయ‌న లంబాడీల సంక్షేమం, అభివృద్ధి, ఎస్టీ రిజ‌ర్వేష‌న్లు వంటి అంశాల్లో అనుస‌రిస్తున్న వైఖ‌రిపై వారు తీవ్రంగా ర‌గిలిపోతున్నారు. నిజానికి కేసీఆర్ మావ‌టె...మారాజ్యే అంటూ 2014 జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్ల‌లో బాగానే ఉద‌ర‌గొట్టారు. విద్యా,ఉపాధి, అభివృద్ధి, లంబాడీ హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌కు పెద్ద‌పీట వేస్తాన్నారు.  గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, మైదాన ప్రాంతాల్లో ఐటీడీఏ ఏర్పాటు, జిల్లాకో ఎస్టీ స్టడీ సర్కిల్, గిరిజన భవన్, ప్రత్యేక నిధుల కేటాయింపు, కేజీ టు పీహెచ్‌డీ వరకు ఉచిత విద్య, తండాల‌ను గ్రామ పంచాయితీలు చేయ‌డంతో పాటు...మిగ‌తా గ్రామాల‌కు వీటిని హామ్లెట్ విలేజ్‌లుగా ఉంచ‌కుండా అభివృద్ధి చేస్తామని తెలిపారు. తండాల‌కు ర‌హ‌దారులు, డ్రైనేజి వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌రిచి వాటిని స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దున‌ని హామీ ఇచ్చారు. 

banjaras

అలాగే లంబాడీల‌కు ప్ర‌భుత్వంలో కీల‌క భాగ‌స్వామ్యం క‌ల్పిస్తామని కూడా ప‌లు మార్లు చెప్పుకొచ్చారు కేసీఆర్‌. అయితే ఇంత వ‌ర‌కూ బాగానే ఉన్నా...గులాబీ ద‌ళ‌ప‌తి ఇచ్చిన హామీలు ఇప్ప‌టికీ ఒక్క‌టీ నేర‌వేర‌క‌పోవ‌డంతో...లంబాడీలు కేసీఆర్‌పై గుస్సాగా ఉన్నారు. తండాల‌ను గ్రామ పంచాయితీలుగా మార్చుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ...హైకోర్టు గ్రామ పంచాయితీల బీసీ రిజ‌ర్వేష‌న్ విధానం స‌రిగా లేదంటూ... స‌ర్కారుకు మొట్టి కాయాలు వేయ‌డానికి స‌ర్కారు నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మ‌ని లంబాడీ నాయ‌కులు చెబుతున్నారు. త‌ద్వారా టీఆర్ఎస్ స‌ర్కారు తండాల‌ను జీపీలుగా ప్ర‌క‌టించినా....మాకేమి ఒరిగింది లేదంటున్నారు. 

banjaras

అంతేకాక ఇటీవల ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్ జిల్లాల్లో  గోండులు, లంబాడీల‌కు మ‌ధ్య చెల్ల‌రేగిన అల్ల‌ర్ల‌పై లంబాడీలు భంగుమంటున్నారు. లంబాడీల‌ను ఏజెన్సీ ప్రాంతాల‌ను నుంచి పంపించ‌డ‌మే కాకుండా వారిని ఎస్టీ జాబితా నుంచి తొల‌గించాలని గోండులు ఉట్నూరు,ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో బీభ‌త్సం సృష్టించారు. జోడేఘాట్‌, కేశ్లాపూర్‌, స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ జాత‌ర్ల‌లో లంబాడీలు వేలు పెట్టేది లేద‌ని పెద్ద ఎత్తున ఉద్య‌మించారు. లంబాడీలు ఆరాధించే ప్ర‌ముఖుల విగ్ర‌హాల‌ను కూడా ధ్వంసం చేశారు. సోయంబాపు నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు నిర్వ‌హించి ర‌హ‌దారులను దిగ్భంధించారు. దీంతో అక్క‌డ పోలీసులు 144 సెక్ష‌న్‌ను విధించినా...కొద్దిరోజుల పాటు ప‌రిస్థితి అదుపులోకి రాలేదు. 

banjaras

అయితే ఈవిష‌యంలో ముఖ్య‌మంత్రి మౌనంగా ఉండ‌డంపై అప్ప‌ట్లో లంబాడీలు మండిప‌డ్డారు. కేసీఆర్‌పై అప్ప‌టి నుంచి వారు ర‌గిలిపోతున్నారు. గోండుల అధిక సంఖ్య‌లో ఉన్న ప్రాంతాల్లో అల్ల‌ర్లు చెల‌రేగుతుంటే ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌డాన్ని వారు స‌హించ‌లేక‌పోతున్నారు. దీంతో పాటు లంబాడీల‌ను ఎస్టీ జాబితా నుంచి తొల‌గించేందుకు కుట్ర జ‌రుతోంద‌ని ఈవిష‌యంలో స‌ర్కారు కూడా సైలెంట్‌గా ఉంద‌ని వారు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ ఈవిష‌యంలో కావాల‌నే మౌనం వ‌హిస్తున్న‌ట్లు చెబుతున్నారు. 

banjaras

ఇప్పుడు ఇదే విష‌యంపై సీఎం మౌనంగా ఉండ‌డంపై లంబాడిలు జీర్ణించుకోలేక‌పోతున్నారు. అందుకే లంబాడ‌లను ఐక్యం చేసి టీఆర్ఎస్‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో బుద్ధి చెప్పేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓటమే లక్ష్యంగా ఉద్యమించేందుకు అడుగులు వేస్తోన్నారు. అందుకోసం లంబాడీ సంఘం నాయకత్వమంతా ఏకమవుతోంది. ఊరూరా తిరిగి లంబాడీ సామాజికవర్గ ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకురావాల‌ని భావిస్తున్నారు. అంతేకాక ‘ఆత్మ గౌరవ సభ’ పేరుతో లంబాడీల స‌త్తా చాటేందుకు స‌మ‌యాత్త‌మ‌వుతున్నారు. లంబాడీల ఎస్టీ జాబితాపై కేసీఆర్ క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డంతో పాటు...ఎన్నిక‌ల సంద‌ర్భంగా సీఎం ఇచ్చిన అన్ని హామీల‌ను నేర‌వేర్చే వ‌ర‌కు త‌మ పోరాటం ఆగ‌బోద‌ని గులాబీ బాస్‌కు వార్నింగ్ ఇస్తున్నారు.  రాబోయే ఎన్నిక‌ల్లో 30 సెగ్మెంట్లలో పూర్తి స్థాయి...మ‌రో 30 సీట్ల‌ల్లో త‌మ ప్ర‌భావం చూపి కారు స్టీరింగ్ త‌ప్ప‌క పికేస్తామ‌ని హెచ్చ‌రిస్తున్నారు. 

banjars

అందుకే కేసీఆర్ ఇప్పుడు లంబాడీల ఫీవ‌ర్ ప‌ట్టుకున్న‌ట్లు పార్టీ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. 2019 ఎన్నిక‌ల్లో లంబాడీలు ఎక్క‌డ త‌మ కొంప ముంచుతారోన‌ని ద‌గ్గ‌రి వాళ్ల వ‌ద్ద కేసీఆర్‌ వాపోతున్న‌ట్లు సమాచారం. మొత్తంగా లంబాడీల ఆందోళ‌న వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఇలాగే కొన‌సాగితే...కారు నాలుగు టైర్లు పేలిపోవ‌డం ఖాయ‌మంటున్నారు విశ్లేష‌కులు. 
 

tags: banjaras fire on kcr,

Related Post