ఉంచాలా..? తొల‌గించాలా..?

news02 Aug. 6, 2018, 1:38 p.m. political

jammu-kashmir

న్యూఢిల్లీ: దేశంలో కొత్త వివాదం మొద‌లైందా..? జ‌మ్ము-కాశ్మీర్ రాష్ట్ర ప్ర‌త్యేక అధికారాల‌కు క‌త్తెర వేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతోందా..? ఆర్టిక‌ల్-370, ఆర్టిక‌ల్‌-35-ఏ కొన‌సాగింపుపై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయా..? ఈ రెండు అధిక‌ర‌ణ‌ల‌ను తొల‌గిస్తే కాశ్మీర్ లోయ‌లో అశాంతి నెల‌కొనే అవ‌కాశం ఉందా..? జ‌మ్ము-కాశ్మీర్ రాష్ట్రానికి విశేష అధికారాలిచ్చిన ఆర్టిక‌ల్ 35-ఏను ఉంచితే మంచిదా..? తొల‌గిస్తే మంచిదా..? ఇప్పుడు ఇదే భార‌త్ మొత్తం ఉత్కంఠ‌గా మారిన అంశంగా త‌య్యారైంది. 

jammu-kashmir

కొద్ది రోజులుగా జ‌మ్ము-కాశ్మీర్ రాష్ట్రానికి క‌ల్పించిన ప్ర‌త్యేక హ‌క్కుల‌పై దేశ వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది. జ‌మ్ము-కాశ్మీర్ వాసుల‌కు ప్ర‌త్యేక హ‌క్కుల‌ను క‌ల్పించే ఆర్టిక‌ల్-370, ఆర్టిక‌ల్-35-ఏ అంశంపై దుమారం చేల‌రేగుతుంది. ముఖ్యంగా భార‌త రాజ్యంగంలోని ఆర్టిక‌ల్ 35-ఏ కొన‌సాగింపును చాలా మంది స‌వాల్ చేస్తున్నారు. రాజ్యాంగ స‌భ ద్వారా ఆమోదం తెలుప‌కుండా కేవ‌లం రాష్ట్రప‌తి ఉత్త‌ర్వుల ద్వారానే ఈ 35-ఏ ను భార‌త రాజ్యాంగంలో చేర్చ‌డంపై సందేహాలు లెవ‌నెత్తున్నారు. ఇది భార‌త సార్వ‌భౌమాధికారానికి గొడ్డ‌లిపెట్ట‌లంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అందుకే ఈ ఆర్టిక‌ల్‌ను తొల‌గించాలని ప‌ట్టుబ‌డుతున్నారు. 

india pak

అస‌లేంటి 35-ఏ...

భార‌త్‌-పాకిస్థాన్ విడిపోయిన‌ప్పుడు దేశంలో అన్ని సంస్థానాలు, రాజ్యాలు ఇండియాలో క‌లిసిపోయాయి. కానీ, ఒక్క మూడు రాజ్యాలు మాత్రమే ఇండియాలో క‌లువ‌కుండా మిగిలిపోయాయి. అందులో గుజ‌రాత్‌ సంస్థానం జునాఘ‌డ్, తెలంగాణ‌లోని నైజం స్టేట్‌,  మ‌రొటి జ‌మ్ము-కాశ్మీర్‌. అయితే జునాఘ‌డ్‌, నైజాం స్టేట్ త‌ర్వాత భార‌త్‌లో విలీనం అయిన‌ప్ప‌టికీ... ఒక్క జ‌మ్ము-కాశ్మీర్ మాత్రం అలాగే ఉండిపోయింది. అక్క‌డి రాజు త‌న రాజ్యాన్ని రెండు దేశాల్లో క‌లుప‌కుండా సొంతంగా ప‌రిపాల‌న చేయాల‌ని భావించాడు. అయితే అప్ప‌టికే మ‌త ప్రాతిపాదిక‌న ఏర్ప‌డిన పాకిస్థాన్‌... కాశ్మీర్‌లో ఎక్కువ మంది ముస్లింలు ఉండ‌డంతో... ఆ ప్రాంతాన్ని త‌మ దేశంలో క‌లిపేసుకునేందుకు కుయుక్తులు ప‌న్నింది. అందులో భాగంగానే పాకిస్థాన్ సైన్యం కాశ్మీర్‌ను అక్ర‌మించుకుంటూ... వ‌చ్చింది. అయితే దీన్ని ప‌సిగ‌ట్టిన అప్ప‌టి రాజు హ‌రిసింగ్ జ‌మ్ము-కాశ్మీర్‌ను భార‌త్‌లో విలీనం చేసేశారు. 

nehru abdulla

అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా... అస‌లు స‌మ‌స్య ఇక్క‌డే మొద‌లైంది. జ‌మ్ము-కాశ్మీర్ కొన్ని ష‌ర‌తుల‌తో భార‌త్‌లో అంత‌ర్భాగం అయింది. భార‌త్ ప్ర‌భుత్వం కూడా జ‌మ్మూ-కాశ్మీర్‌కు మ‌న రాజ్యాంగంలో ప్ర‌త్యేక హ‌క్కుల‌ను క‌ల్పించింది. అందుకు అనుగుణంగానే ఆర్టిక‌ల్ 370ని రాజ్యాంగంలో పొందుప‌ర్చింది. దీని ప్ర‌కారం జ‌మ్ము-కాశ్మీర్ రాష్ట్రంలో కేంద్ర ప్ర‌భుత్వం ర‌క్ష‌ణ‌,విదేశీ, ఆర్థిక‌, హోం వంటి అంశాలు త‌ప్ప మిగ‌తా వాటిలో వేలు పెట్ట‌డానికే వీలులేకుండా పోయింది. దీనికి తోడూ అప్ప‌టి దివంగ‌త‌ ప్ర‌ధాని నెహ్రు, కాశ్మీర్ నేత షేక్ అబ్దుల్లా మ‌ధ్య చారిత్రాత్మ‌క‌మైన ఒప్పందం ఒక‌టి జ‌రిగింది. దాని ప్ర‌కారం ఆర్టిక‌ల్-370 అప్ప‌టికే జ‌మ్ము-కాశ్మీర్‌కు ప్ర‌త్యేక హోదా ఉన్న‌ప్ప‌టికీ ఆ రాష్ట్రానికి మ‌రిన్ని విశేషాధికారాలు క‌ల్పిస్తూ.. భార‌త రాష్ట్రప‌తి ఉత్వ‌ర్వులు జారీ చేశారు. ఈ ఉత్త‌ర్వుల ప్ర‌కార‌మే రాజ్యాంగంలో జ‌మ్ము-కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి ఆర్టిక‌ల్ 35-ఏ ను చేర్చారు. 

kashmir assembly

అయితే ఆర్టిక‌ల్ 35-ఏ ప్ర‌కారం జ‌మ్ము-కాశ్మీర్‌లో స్థానికులు ఎవ‌ర‌నేది నిర్ణ‌యించే అధికారం పూర్తిగా... ఆ రాష్ట్ర అసెంబ్లీకే వ‌దిలేశారు. దీంతో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం జ‌మ్ము-కాశ్మీర్ స్థానిక‌త‌పై అప్ప‌ట్లో కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కూడా విడుద‌ల చేసింది. దీనిపై ప్ర‌కారం 1911 క‌న్న ముందు జ‌మ్ము-కాశ్మీర్‌లో నివాస‌మున్న వారిని మాత్ర‌మే స్థానికులుగా గుర్తించింది. వారికే రాష్ట్రంలో ఉద్యోగాలు, ప‌ద‌వులు, వ్యాపారులు, ఆస్తులు కొనుగోలు చేయ‌డం వంటి హ‌క్కుల‌ను క‌ల్పించింది. అంతేకాక అక్క‌డి అమ్మాయిలు బ‌య‌టి వారిని పెళ్లి చేసుకుంటే వారి హ‌క్కులు కూడా హ‌రించేలా క‌ఠినమైన చ‌ట్టాల‌ను రూపొందించింది. ఇక అప్ప‌టి నుంచి ఈ ఆర్టిక‌ల్‌పై వివాదం కొన‌సాగుతునే ఉంది. 

suprme court

ఈ నేప‌థ్యంలోనే కొద్ది సంవ‌త్స‌రాల క్రితం ఢిల్లీకి చెందిన ఓ స్వ‌చ్చంధ సంస్థ.. ఆర్టిక‌ల్ 35-ఏ ను ర‌ద్దు చేయాల‌ని సుప్రీం త‌లుపు త‌ట్టింది. కేవ‌లం రాష్ట్రప‌తి ఉత్త‌ర్వుల ద్వారా ఈ ఆర్టిక‌ల్‌ను రాజ్యాంగంలో చేర్చ‌డాన్ని ప్ర‌శ్నించింది. వెంట‌నే ఈ ఆర్టిక‌ల్‌ను తొల‌గించాల‌ని కోర్టుకు విజ్ఞ‌ప్తి చేసింది. ఈ కేసు ఇటివ‌లే సుప్రీం కూడా విచార‌ణ చేప‌ట్టింది. దీనిపై అటూ... ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇటూ.. కేంద్రం ప్ర‌భుత్వం కూడా త‌న కౌంట‌ర్‌ను స‌బ్మిట్ చేశాయి. అయితే ఈ విష‌యంపై స్పందించిన కేంద్ర స‌ర్కారు దీన్ని విస్తృత ధ‌ర్మాస‌నానికి నివేదిస్తే బాగుంటుంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేసింది. ఇక జ‌మ్ము-కాశ్మీర్ నేత‌లు ముప్తీ, ఒమ‌ర్ మాత్రం ఈ ఆర్టిక‌ల్‌ను తొల‌గిస్తే కాశ్మీర్‌లో జాతీయ జెండా ఎగ‌ర‌డం క‌ష్ట‌మ‌ని తెలిపారు. అధికారులు, పోలీసులు ఇలా ఎవ‌రూ కూడా భార‌త ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించ‌క‌పోవ‌చ్చ‌ని హెచ్చ‌రించారు.

modi

అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా... ఇప్పుడు ఇది కాస్తా రాజ‌కీయ రంగు ములుముకుంటుండ‌డం విశేషం. ప్ర‌స్తుతానికి ఈ కేసు కోర్టులోనే ఉన్నా... బీజేపీ మాత్రం ఎలాగైనా 35-ఏ ఆర్టిక‌ల్ ఇష్యూను లెవ‌నెత్తి దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రిగేట‌ట్లు చూడాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. త‌ద్వారా 2019 ఎన్నిక‌ల నాటికి గంప గుత్త‌గా హిందువుల ఓట్ బ్యాంక్‌ను సొంతం చేసుకోవాల‌ని స్కెచ్ రెడీ చేసుకున్న‌ట్లు అవ‌గ‌తం అవుతోంది. 35-ఏ ఆర్టిక‌ల్‌పై ఎంత చ‌ర్చ జ‌రిగితే అంత‌లా రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు త‌మ‌కు అనుకూలంగా మారుతాయ‌నే భావ‌న‌లో ఆ పార్టీ ఉంది. ఇక కాశ్మీర్ నేత‌లు ముప్తి, ఒమ‌ర్ మాత్రం ఈ అంశం పై అగ్గి రాజుకోవ‌డం ద్వారా తమ‌కే లాభిస్తుంద‌నే భావ‌న‌లో ఉన్నారు. అందుకే మాజీ ముఖ్య‌మంత్రి ముప్తి ఈ విష‌యంలో గ‌ట్టిగానే కౌంట‌రిస్తున్నారు. 

kashmir leaders

ఇక ఇరు ప‌క్షాలు ఈ అంశాన్ని రాజ‌కీయంగా ముడిపెట్ట‌డ‌డ‌పైనే ప‌లువురు మండిప‌డుతున్నారు. ఇన్నిరోజులు లెవ‌నెత్త‌ని ఈ అంశాన్ని ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ తెర‌పైకి తేవ‌డంపైనే ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.  అందుకే ఈ విష‌యంపై ఎవ‌రూ స్పందించ‌క‌పోతే మంచిదంటున్నారు విశ్లేష‌కులు. ఒక‌వేళ 35-ఏ అధిక‌ర‌ణ‌ను ముట్టుకుంటే తీవ్ర ప‌రిణామాలు త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఈ ఆర్టిక‌ల్‌ను తొల‌గించేందుకు ప్ర‌య‌త్నిస్తే అక్క‌డి అధికారులు, స్థానిక పోలీసుల నుంచి కూడా కొత్త త‌ల‌నొప్పులు త‌ప్ప‌వంటున్నారు. వారు కేంద్ర ప్ర‌భుత్వం, మిల‌ట‌రీ బ‌ల‌గాల‌పై తిరుగుబావుటా ఎగుర‌వేయ‌డం ఖాయ‌మంటున్నారు. ఇప్ప‌టికే కాశ్మీర్ లోయ‌లో అల్ల‌ర్ల‌తో అట్టుకుతున్న ప్రాంతాల్లో ఈ అంశం మ‌రింత అగ్గికి ఆజ్యం పోసిన‌ట్లు మార‌క త‌ప్ప‌దంటున్నారు. మొత్తంగా 35-ఏ ఆర్టిక‌ల్‌ను తొల‌గించాల‌నే ప్ర‌య‌త్నం అది జ‌మ్ము-కాశ్మీర్ స్థానిక‌త‌నే ప్ర‌శ్నార్థ‌కం చేసి పౌర యుద్ధంకు దారితీయ‌వ‌చ్చంటున్నారు. ఫ‌లితంగా అంత‌ర్జాతీయంగా భార‌త్ అభాసుపాలై ప‌రువు తీసుకోవ‌డం ఖాయ‌మంటున్నారు. అందుకే ఈ అంశాన్ని ఇప్ప‌టికైనా వ‌దిలేసి ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో బీజేపీ స‌ర్కారు 35-ఏ ఆర్టిక‌ల్‌కు మ‌ద్ద‌తునిస్తూ... కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌డ‌మే ఉత్త‌మ‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తుండ‌డం విశేషం. 

tags: article 35-a,jammu-kashmir,article 35a of indian constitution,indian constitution article 35a in hindi,article 35a kashmir,article 35a kashmir in hindi,article 35 a kashmir issue,article 35a greater kashmir,jammu and kashmir article 35a article 35a of jammu kashmir constitution,article 35 a kashmir,article 35a of kashmir constitution,article 35a and kashmir, article 35a for kashmir,article 35 a kashmir hindi,article 35a in kashmir,article 35a jammu kashmir in hindi,article 35a jammu kashmir article 35a jammu and kashmir,article 35a of kashmir,article 35a of jammu kashmir,what is article 35a kashmir

Related Post