బెంగళూరు (నేషనల్ డెస్క్)- చాలా ఆసక్తికర పరిణామాల మధ్య కర్నాటక ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన కుమార స్వామి.. తన పదవిని ఎన్నాళ్లు కాపాడుకుంటారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్-జేడీఎస్ లు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. రెండు పార్టీల్లోంచి ఎమ్మెల్యేలు ఎప్పుడు కమలంలోకి జంప్ అవుతారోనన్న అనుమానం పట్టిపీడిస్తోంది. మరోవైపు తృటిలో అధికారాన్ని కోల్పోయిన బీజేపీ అవకాశం కోసం ఎదురుచూస్తోంది.
ఇదిగో ఇటువంటి సమయంలో కర్నాటక సీఎం కుమార స్వామి కొత్త విషయం చెప్పారు. తాను ముఖ్యమంత్రి కావడం తన తండ్రి దేవెగౌడకు అస్సలు ఇష్టం లేదట. కాంగ్రెస్-జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో భాగంగా కుమార స్వామిని సీఎం ను చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పగా.. దేవెగౌడ అభ్యంతరం చెప్పారట. కుమార స్వామికి రెండు సార్లు గుండె ఆపరేషన్ అయ్యింది... ఆరోగ్యం బాగా లేదు.. అందుకే వద్దన్నారని స్వయంగా కుమార స్వామే చెప్పారు. ఐతే కాంగ్రెస్ పట్టుబట్టడంతో ముఖ్యమంత్రి అయ్యానని స్పష్టం చేశారు.