యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్న పుష్ప-2
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ పుష్ప2- ది రూల్ (Pushpa2- The Rule) విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘పుష్ప.. పుష్ప.. పాట యూట్యూబ్లో దూసుకుపోతోంది. ఈ సాంగ్ విడుదలైన అన్ని భాషల్లో కలిపి మొత్తం 150 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. అంటే 15 కోట్ల వ్యూస్ సొంతం చేసుకుందన్న మాట. ఈ విషయాన్ని తెలియజేస్తూ పుష్ప టీమ్ ఆనందం వ్యక్తం చేసింది.
రష్మిక మందన్న (Rashmika) హీరోయిన్ గా నటిస్తున్న పుష్ప2 మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. ఈ సినిమా డిసెంబరు 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ చిత్రాలు, పాటలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.
పుష్ప-2 షూటింగ్ నుంచి కొంత విరామం తీసుకుని కుటుంబంతో కలిసి విహారానికి వెళ్లిన అల్లు అర్జున్.. మళ్లీ రంగంలోకి దిగబోతున్నారు. ఆగస్టు మొదటి వారం నుంచి తిరిగి పుష్ప2 సెట్లోకి అడుగు పెట్టబోతున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నారు. మిగతా ఆర్టిస్టులతో ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. ఇతర నటులపై రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఆగష్టు మొదటి వారంలో మొదలయ్యే షెడ్యూల్లో అల్లు అర్జున్పై క్లైమాక్స్ సీన్స్ షూట్ చేయనున్నట్లు సమాచారం.