అప్పుడు జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు కేటీఆర్
రాఖీ పౌర్ణమి వెళ్లిపోయి వారం రోజులవుతోంది. కానీ ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా రాఖీ గురించే చర్చ జరుగుతోంది. రాఖీకి కూడా భయపడితే ఎలా అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన ట్విట్టర్ పోస్టు ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ తన చేతి నిండా రాఖీలు కట్టుకొని ఉన్న ఫోటో ను షేర్ చేస్తూ.. రాఖీకి కూడా భయపడితే ఎలా అని కామెంట్ చేశారు. అసలేం జరిగిందంటే.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. దీంతో కేటీఆర్ శనివారం మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మహిళా కమిషన్ సభ్యులు కేటీఆర్‌కు రాఖీ కట్టారు.
కేటీఆర్‌కు కమిషన్ సభ్యులు రాఖీలు కట్టడంపై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆరుగురు మహిళా సభ్యులకు నోటీసులు జారీ చేయాలని సెక్రటరీని కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద ఆదేశించారు. మహిళా కమిషన్ ప్రాంగణంలో నిష్పాక్షింగా వ్యవహరించాలని సభ్యులను ముందే హెచ్చరించామని నేరెళ్ల శారద తెలిపారు. కమిషన్ కార్యాలయంలోకి మొబైల్ ఫోన్లను కూడా అనుమతించలేదన్నారు. అయినప్పటికీ రహస్యంగా తీసుకెళ్లి రాఖీ కట్టిన వీడియోలను చిత్రీకరించడం, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంపై ఛైర్‌పర్సన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ సందర్బాన్ని పురస్కరించుకుని రాఖీకు కూడా భయపడితే ఎలా అని కేటీఆర్ ట్విట్టర్-ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. దీంతో కేటీఆర్ చేతి నిండా రాఖీలు కట్టుకొని ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేటీఆర్ ఫోటోను రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఫోటోను పోల్చుతూ సేమ్ టు సేమ్ అంటూ బీఆర్ఎస్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు మీరు రాఖీ పౌర్ణమి రోజున సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి రాఖీ కట్టారు రాఖీ కడితే తప్పు లేదు కానీ.. మిగతా సభ్యులు కడితే తప్పా అని బీఆర్‌ఎస్ కార్యకర్తలు నేరెళ్ల శారదను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.