Rains

సోమవారం హైదరాబాద్ లో విద్యా సంస్థలకు సెలవు 

తెలంగాణకు భారీ వర్ష సూచన-9 జిల్లాలకు రెడ్ అలర్ట్

గత రెండు రోజులుగా భారీ వర్షాలు (Hevay Rains) జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానల నేపధ్యంలో తెలంగాణ (Telangana) ప్రభుత్వం అప్రమత్తమైంది. సోమవారం హైదరాబాద్ లోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో శుక్రవారం రాత్రి నుంచి కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి సీఎస్‌ శాంతి కుమారిని ఆదేశించారు. శనివారం అత్యధికంగా సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో 29.3, చిలుకూరులో 28.2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో 21.3 సెం.మీ వర్షం కురిసింది. ఇక్కడ శుక్రవారమూ 18.1 సెం.మీ నమోదైంది. 

ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదిలి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలోని విశాఖపట్నం, గోపాల్‌పూర్‌ మధ్య కళింగపట్నానికి సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో ఆదివారం, సోమవారం రెండు రోజుల పాటు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. భారీ వర్షాల నేపధ్యంలో హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపైకి భారీగా నీరు చేరడంతో కోదాడ మండలం శ్రీరంగాపురం వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. జగ్గయ్యపేట వద్ద రోడ్డు బ్లాక్‌ అయ్యింది.

హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కెట్‌ పల్లి నుంచి వయా మిర్యాలగూడ, గుంటూరు మీదుగా దారి మళ్లిస్తున్నారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య నడిచే పలు రైళ్లను ఆది, సోమవారాల్లో రద్దు చేసినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. శనివారం 4, సెప్టెంబరు 1న  6, 1 నుంచి 2వ తేదీ వరకు మరో 6 రైళ్లను రద్దు చేసినట్లు స్పష్టం చేసింది రైల్వే శాఖ. వాయుగుండం నేపథ్యంలో తెలంగాణలోని మొత్తం 9 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ ఎలెర్ట్‌ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో 20 సెంటీ మీటర్లకు పైగా వర్షం నమోదయ్యే సూచనలు ఉన్నాయి. మరో 12 జిల్లాల్లోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంతాలు, రోడ్లు, లోలెవల్‌ వంతెనలు మునిగిపోయే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. విద్యుత్‌ స్తంభాలు, చెట్లు కూలి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అత్యవసరం ఐతే తప్ప బయటకు రావద్దని సూచించింది.  
 


Comment As:

Comment (0)