Newspillar
Newspillar
Tuesday, 10 Sep 2024 18:30 pm
Newspillar

Newspillar

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెరువుల ఆక్రమణలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు పెద్దలు ప్రాజెక్టుల వద్ద ఫాంహౌస్‌లు కట్టుకున్నారని, ఫాంహౌస్‌ల నుంచి వచ్చే డ్రైనేజీని గండిపేటలో కలుపుతున్నారని మండిపడ్డారు. గండిపేట జలాలు నగర ప్రజల తాగునీటికి వాడుతున్నామని చెప్పారు రేవంత్ రెడ్డి. నాలాల ఆక్రమణలతో ఉప్పెనలా వరదలు వస్తున్నాయని, వరదలు వస్తే పేదల ఇళ్లు మునుగుతున్నాయని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులను ఆక్రమణల నుంచి విడిపించేందుకే హైడ్రా (HYDRAA) ఏర్పాటు చేశామని, ఆక్రమణలను వదిలి గౌరవంగా తప్పుకోండని సూచించారు. 

లేదంటే ఖచ్చితంగా చెరువుల ఆక్రమణలను కూల్చే బాధ్యత తాము తీసుకుంటానని స్పష్టం చేశారు. కూల్చివేతలపై ఎవరైనా స్టే తెచ్చుకున్నా కోర్టుల్లో కొట్లాడుతామని రేవంత్​ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ కాలుష్యం నల్గొండకు చేరుతోందని, ఆ కాలుష్యాన్ని నియంత్రించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో చెరువుల ఆక్రమణలు తొలగించి మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి చేస్తామని, మూసీ పరివాహక ప్రాంతంలో పేదల ఆక్రమణలు ఉన్నాయని చెప్పిన రేవంత్.. పేదల పట్ల ప్రభుత్వం మానవతా ధోరణితో వ్యవహరిస్తుందని.. 11 వేల మంది బాధితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.